● వితంతువుకు అన్యాయం
● ఇంటర్వ్యూలు ముగిసి ఐదు నెలలైనా పూర్తికాని నియామకం
ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు నియామకం అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర అవినీతి, అంతర్గత కుమ్ములాటలకు వేదికగా మారింది. 2026 మార్చి నెలలో విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి, 2026 ఏప్రిల్ 23వ తేదీనే ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా మిగిలిన అన్ని ఖాళీ పోస్టులలో అభ్యర్థులను నియమించినప్పటికీ, ఒక్క ఒంటిమిట్ట పోస్టు విషయానికి వచ్చేసరికి ఐదు నెలలుగా అధికారులు ఫలితాలను ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారు.
వితంతువుకు అన్యాయం.. నిబంధనలు గాలికే!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంగన్‌వాడీ టీచర్ పోస్టుల ఎంపికలో వితంతువులకు (భర్త లేని మహిళలకు) మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారిలో భర్త చనిపోయి, ఇద్దరు ఆడపిల్లలతో జీవనోపాధి లేక అల్లాడుతున్న ‘సౌందర్య’ అనే వితంతువు అర్హురాలై ఉన్నప్పటికీ ఆమెను పూర్తిగా పక్కనబెట్టేశారు. నిబంధనలను తుంగలో తొక్కి, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే ఈ ఉద్యోగాన్ని కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తుండటంపై మండలవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యుక్తమవుతున్నాయి.
తెలుగుతమ్ముళ్ల వాగ్వాదం.. రూ. 5లక్షలకు డీల్!
ఇక్కడ పోస్టు కోసం మొత్తం ఏడుగురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో ఇద్దరు టీడీపీ అభ్యర్థుల వైపు నుంచి రాజకీయంగా తీవ్ర ఒత్తిడి వస్తోంది. రాజంపేటకు చెందిన ఒక ప్రముఖ టీడీపీ ముఖ్య నేత ఈ నియామకంలో చక్రం తిప్పుతూ.. పోటీ పడుతున్న ఆ ఇద్దరు అభ్యర్థులకూ ఈ అంగన్‌వాడీ పోస్టును కేటాయించాలంటూ సిఫారసు లేఖలు ఇవ్వడం గమనార్హం. ఈ ఒక్క పోస్టుకు తెరవెనుక సుమారు రూ.5 లక్షల వరకు గిరాకీ నడుస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు విషయమై స్థానిక తెలుగుతమ్ముళ్ల మధ్య బహిరంగంగానే పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటర్వ్యూలు పూర్తయి ఐదు నెలలు కావస్తున్నా అర్హులైన వితంతువును నియమించకుండా, కేవలం రాజకీయ అండ ఉందనే కారణంతో ఇతరులకు అప్పజెప్పేందుకు చూస్తుండటంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే పోస్టుకు ఇద్దరు అధికార పార్టీ అభ్యర్థులు సిఫారసు లేఖలతో ఒత్తిడి తెస్తుండటంతో, ఎవరికి అంటగట్టాలో తెలియక సంబంధిత ఉన్నతాధికారులు తల పట్టుకుంటున్నారు.


