‘నేషనల్‌ గ్రాప్లింగ్‌’లో ప్రథమ స్థానం | - | Sakshi
Sakshi News home page

‘నేషనల్‌ గ్రాప్లింగ్‌’లో ప్రథమ స్థానం

Aug 12 2026 2:58 AM | Updated on Aug 12 2026 2:58 AM

కడప ఎడ్యుకేషన్‌ : ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈ నెల 1 నుంచి 7 వరకు జరిగిన నేషనల్‌ రెజ్లింగ్‌ గ్రాప్లింగ్‌ చాంపియన్‌షిప్‌ 2026–27 పోటీల్లో కడప ఎస్‌కేఆర్‌ – ఎస్‌కేఆర్‌ ఉమెన్స్‌ కళాశాల విద్యార్థిని పోలి చైత్ర అద్భుత విజయం సాధించారు. కడప జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన చైత్ర అండర్‌ 19 విభాగంలో 65 కిలోల బరువు విభాగంలో బీచ్‌ గ్రాప్లింగ్‌ స్టైల్‌ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం కై వసం చేసుకున్నారు. ఈ పోటీలను ఏపీ బీచ్‌ గ్రాప్లింగ్‌ అసోసియేషన్‌, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ విద్యార్థి ని మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌.స్మిత, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి పి.వి.సుబ్బారెడ్డి, ఎన్‌సీసీ సీటీఓ సుజాత, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ కృష్ణవేణితోపాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.

మద్యం మత్తులో

యువకుడిపై దాడి

మైదుకూరు : బార్‌లో మద్యం తాగుతుండగా నాయని వీరేష్‌ అనే యువకుడిపై మద్యం మత్తులో ఉన్న మరో యువకుడు రాకేష్‌ దాడి చేసి గాయపరిచిన సంఘటన మంగళవారం మైదుకూరులో జరిగింది. స్థానిక సీపీఐ కాలనీకి చెందిన వీరేష్‌ అరటి తోటల్లో కూలి పనికి వెళుతుంటాడు. మంగళవారం బద్వేలు రోడ్డులోని బార్‌లో మద్యం తాగుతుండగా.. అరుంధతి నగర్‌కు చెందిన రాజేష్‌ అతనిని తిట్టి దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో తలపై మోదాడు. గాయపడిన వీరేష్‌ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కూలిన చౌడు మిద్దె పైకప్పు

మైదుకూరు : మున్సిపాలిటీ పరిధిలోని మామిళ్లపల్లె కొత్తపల్లెలో మంగళవారం తెల్లవారుజామున వర్షానికి నానిపోయి పెద్ద రోశయ్యకు చెందిన చౌడు మిద్దె పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో పెద్ద రోశయ్య, ఓబుళమ్మ దంపతులు నిద్రిస్తున్నారు. మంచం పక్కగా పైకప్పు కూలడంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. పైకప్పు కూలిన శబ్దానికి ఇరుగుపొరుగు వారు వచ్చి గోడకు ఉన్న గూటి బండను తొలగించి లోపల ఉన్న వారిని బయటికి తెచ్చారు.

కేసు నమోదు

మైదుకూరు : మైదుకూరు శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు మంగళవారం తెలిపారు. కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై వెంకటేశ్వరస్వామి గుడి వద్ద కారు, బైక్‌ను ఢీకొన్న సంఘటనలో చెన్నూరుకు చెందిన ముగ్గురు యువకులు గాయపడిన సంఘటన తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement