డిమాండ్ల సాధన కోసం జూడాల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

డిమాండ్ల సాధన కోసం జూడాల ఆందోళన

Aug 12 2026 2:58 AM | Updated on Aug 12 2026 2:58 AM

కడప అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఏపీ జూడా) ఇచ్చిన పిలుపుతతో ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్‌ ఆవరణలో ఇంటర్న్‌షిప్స్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌, సూపర్‌ స్పెషాలిటీ పీజీలు, సీనియర్‌ రెసిడెంట్స్‌ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఫేజ్‌–1ను మంగళవారం ప్రారంభించారు. జూనియర్‌ డాక్టర్ల న్యాయబద్ధమైన, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మెను ఐక్యంగా, శాంతియుతంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ కడప జీఎంసీ యూనిట్‌ నుంచి జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ మేఘన, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఏ.లక్ష్మీకాంత్‌, కార్యదర్శి డాక్టర్‌ కె.యశ్వంత్‌ కృష్ణ, ఉపాధ్యక్షుడు ఎస్‌.యశ్వంత్‌కృష్ణ మాట్లాడారు. జూనియర్‌ డాక్టర్ల స్టైఫండ్‌ను పెంచాలన్నారు. సవరించిన స్టైఫండ్‌ను ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలు చేయాలన్నారు.

వైద్యుల రిటైర్మెంట్‌ వయసును 65 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్‌ఎంసీ నిబంధనలను పాటించాలన్నారు. మెడికల్‌ ఫ్యాకల్టీ పోస్టుల్లో ఎం ఎస్సీ/పీహెచ్‌డీ వంటి నాన్‌–మెడికల్‌ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టకూడదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు, అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. అనంతరం కడప జీజీహెచ్‌ రిమ్స్‌ ఐపీ నుంచి ఓపీ, వైద్య కళాశాల వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ రెసిడెంట్లు, జూనియర్‌ డాక్టర్లు, హౌస్‌ సర్జన్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement