వేంపల్లె : ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సరికొత్త ఆలోచనలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ ప్రకాష్ పిలుపునిచ్చారు. సోమవారం ఇడుపులపాయ క్యాంపస్‌లో ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో ‘స్టార్టప్ కడప – ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్ ప్రతినిధి గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగులుగా కాకుండా, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. వ్యాపార రంగంలో వచ్చే ఆర్థిక నష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు లభించే ఆర్థిక సహాయ మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సదస్సులో ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి డాక్టర్ పెనుకొండ రవికుమార్, డీన్ డి.రమేష్ కై లాస్, పీఆర్‌ఓ డాక్టర్ జి.తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


