ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ నాయకుల ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, కడప: దగా డీఎస్సీపై ప్రజా పోరు నింగినంటింది. పోలీసులను అడ్డు పెట్టి వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన ర్యాలీని కట్టడి చేయాలని చూసి కూటమి ప్రభుత్వ ప్రయత్నం విఫలమైంది. ఖాకీల ఆంక్షల సంకెళ్లు యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణుల ర్యాలీల ముందు నిలవలేకపోయాయి. పట్టణ.. పురవీధులన్నీ వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పోటెత్తాయి. డీఎస్సీలో అక్రమాలు వెలికితీయాలని చిత్తశుద్ధితో కొనసాగిస్తున్న ఉద్యమాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు విజయవంతంగా నిర్వహించాయి. పులివెందులలో లాఠీఛార్జి చేసినా, కడప, కమలాపురం, రాజంపేట, మైదుకూరులలో కట్టడి చేయాలని ప్రయత్నించినా కార్యకర్తలు ఇసుమంత కూడా వెనక్కి తగ్గలేదు. పైగా మరింత దూకుడుగా నిరశన కొనసాగించారు.
● జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ సోమవారం చేపట్టిన నిరసన ర్యాలీ విజయవంతమైంది. డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి అయినవారికి కట్టబెట్టారనే ఆరోపణలకు భారీ ఎత్తున ప్రజా మద్దతు లభించింది. అక్రమాలకు తెరలేపిన మంత్రి నారాలోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి.
● పులివెందులలో స్థానిక పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ జనం సందోహం మధ్య నిరసన ర్యాలీ కొనసాగించారు. పోలీసులు శ్రేణులపై లాఠీఛార్జి చేసినా వెనుకంజ వేయలేదు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆంక్షలు విధించినా, ప్రజల తరఫున పోరాటాన్ని ఆపేది లేదన్నారు. డీఎస్సీ క్వశ్చన్ పేపర్ అప్‌లోడ్ చేసిన ఎస్సీఈఆర్టీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్ అనే వ్యక్తికే రాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చిందని లీకేజీ జరిగిందని ఒప్పుకున్న ప్రభుత్వం అతని ఉద్యోగాన్ని పక్కన పెట్టిందన్నారు. ఇక జీవో నంబర్ 4, 47, 76లను తెచ్చి అసలు పరీక్షే రాయకుండా ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనలు మార్చారని తూర్పారబట్టారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
● బద్వేల్.. స్థానిక ఎన్జీఓ కాలనీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ కొనసాగించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందురెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా నేతృత్వంలో భారీ ఎత్తున ప్రజలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యనేతలు మాట్లాడుతూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు, ర్యాలీ చేపడితే పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమని, ఇది రాజ్యాంగ విరుద్దమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఉద్యమాలు ఆణచవేయలేరన్నారు.
● కమలాపురంలో స్థానిక గ్రామ చావడి నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీని ఇన్‌ఛార్జి నరేన్ రామాంజులరెడ్డి, అదనపు సమన్వయకర్త అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి నేతృత్వంలో కొనసాగించారు. ర్యాలీని పోలీసులు శతవిధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసి విఫలమైయ్యారు. వేలాది మంది యువత ప్రజలు పాల్గోని ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీని కొనసాగించారు.
● మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ర్యాలీ విజయవంతమైంది. స్థానిక వనిపెంట రోడ్డులోని డీసీఎల్ కల్యాణ మండపం నుంచి ఉదయం 10 గంటల సమయంలో ర్యాలీకి సిద్ధం కాగా, అర్బన్ సీఐ రమణారెడ్డి ర్యాలీని నియంత్రించాలని ప్రయత్నించారు. విద్యార్థి, యువజన విభాగం నాయకులు రోడ్డుపైనే బైఠాయించి డీఎస్సీ అక్రమాలపై నిగ్గు తేల్చాలని నినాదాలు చేశారు.
● ప్రొద్దుటూరులో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గురువయ్య తోటలోని నాలుగు రోడ్ల కూడలి నుంచి ర్యాలీ నినాదాలతో సాగింది. ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు మున్సిపల్ కార్యాలయం చుట్టు మూడు రోడ్ల వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేసి ర్యాలీ అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం వైఎస్సార్‌సీపీ శ్రేణులు మున్సిపల్ పార్కు వద్ద నిరసన వ్యక్తం చేశారు.
● జమ్మలమడుగులో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి నేతృత్వంలో వేలాది మంది ప్రజలు పార్టీ కేడర్‌తో వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దనుంచి రామిరెడ్డిపల్లె రహదారి, పెద్దపసుపల మోటు, సంజామలమోటుల మీదుగా పాతబస్టాండ్‌లో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వరకూ చేపట్టారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పొన్నపురెడ్డి వెంకటశివారెడ్డి, గిరిధర్‌రెడ్డిలతో పాటు ఆరు మండలాలకు చెందిన కేడర్ డీఎస్సీ అక్రమాలపై నినదిస్తూ నిరసన కొనసాగించారు.
● కడప వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యలాయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. మాజీ మంత్రి అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలతోపాటు అన్నీ విభాగాలకు చెందిన కేడర్‌తో పాటు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.ర్యాలీని కట్టడి చేసేందుకు నగరంలో ఉన్న పోలీసు అధికారులు పెద్ద ఎత్తున యత్నించారు. పోలీసుల ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొని ఆర్డీఓ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగించారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మునుపెన్నడూ డీఎస్సీలో ఇలాంటి ధోరణి చూడలేదన్నారు. ప్రభుత్వం అడ్డుగోలుగా నియమకాలు చేసుకొనేందు అడ్డదారుల్లో జీఓలు తెచ్చిందని మాజీ మంత్రి అంజద్ బాషా ఆరోపించారు.
● రాజంపేటలో ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ర్యాలీ ప్రారంభం కాగానే, పట్టణ సీఐ నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. రోప్‌ను అడ్డంగా పెట్టడంతో తొక్కిసలాటకు దారితీసింది. ఎమ్మెల్యే ఆకేపాటితో పాటు పార్టీ శ్రేణులు, నేతలు పోలీసుల చర్యలను వ్యతిరేకించారు. పోలీసుల దౌర్జన్యంపై ఎమ్మెల్యే ఆకేపాటి నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడిన మంత్రి లోకేష్‌ను కాపాడుకునేందుకు సీఎం చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.


