● జిల్లాలో గణనీయంగా తగ్గిన సాగు
● 60 శాతంపైనే తగ్గిన సాగు విస్తీర్ణం
● ధరల ప్రభావంతోనే సాగుకు
ముందుకు రాని రైతులు
వేముల : జిల్లాలలో ఈ ఏడాది ఉల్లి సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పటివరకు 7 వేల ఎకరాల్లో మాత్రమే ఉల్లి సాగైందని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొన్నారు. గతేడాది జిల్లాలో రైతులు విస్తారంగా ఉల్లి సాగు చేసుకున్నారు. పెట్టుబడులు ఎక్కువైనా ఉల్లివైపే మొగ్గు చూపారు. అయితే దిగుబడులు వచ్చే సమయానికి ధరలు పతనమయ్యాయి. దీంతో పెట్టుబడులు కూడా చేతికందక అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాదీ అదే పరిస్థితి ఎదరవుతుందనే భయంతో ఉల్లి సాగుకు మొగ్గు చూపలేదు. కొనుగోళ్లకు వ్యాపారులు కూడా రాకపోవడంతో ట్రాక్టర్లలో బయటకు తోలుకోవాల్సిన పరిస్థితులను చూసిన రైతులు ఈ ఏడాది సాగుకు ఆసక్తి చూపలేదు.
7 వేల ఎకరాల్లో సాగు
ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 7 వేల ఎకరాలలో ఉల్లి సాగైనట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. మైదుకూరు, వీరపునాయునిపల్లె, తొండూరు, వేముల, వేంపల్లె, పెండ్లిమర్రి, ముద్దనూరు మండలాల్లో అత్యధికంగా సాగవుతుంది. మిగిలిన మండలాల్లో అక్కడక్కడ సాగు చేసేవారు. అయితే ఈ మండలాల్లో సగం మంది రైతులు ఉల్లి సాగుకు ఆసక్తి చూపలేదు. ఏటా మే, జూన్‌లో ఉల్లి సాగు చేసేవారు.
60 శాతంపైనే తగ్గిన సాగు విస్తీర్ణం
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 60 శాతంపైనే ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గతేడాది జిల్లాలో 20 వేల ఎకరాల్లో ఉల్లి సాగైతే.. ఈ ఏడాది 7 వేల ఎకరాలకు పడిపోయింది. ఆయా మండలాల్లో సాగుకు రైతులు ముందుకు రాలేదు. సాగులో పెట్టుబడులు పెట్టి నష్టపోతామనే భయం రైతులను వెంటాడింది. ఒకవైపు వర్షాభావంతో నీటి వనరులు తగ్గిపోతాయనే ఆందోళన.. మరోవైపు ధరలు లేకపోతే నష్టపోతామనే భయంతో రైతులు ఉల్లి సాగుకు సాహసించలేకపోయారు.
ఎకరాకు రూ.80 వేలకుపైనే పెట్టుబడులు
ఉల్లి సాగులో పెట్టుబడులు పెరిగిపోతూనే ఉన్నాయి. గతేడాది రూ.50వేల నుంచి రూ.60వేల వరకు పెట్టుబడులైతే.. ఈ ఏడాది ఎకరాకు రూ.80వేలకు పైనే పెట్టుబడులు అవుతున్నాయని రైతులు అంటున్నారు. ఉద్యాన పంటలలో పెట్టుబడులతో కూడుకున్న పంట ఉల్లి. ఈ ఏడాది రసాయనిక ఎరువుల ధరలు, కూలీల రేట్లు, ట్రాక్టర్ బాడుగలు పెరిగిపోయాయి. బస్తా రసాయనిక ఎరువుపై రూ.450 మేర ధరలు పెరిగితే పంటలు ఎలా సాగు చేసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సాగులో పెట్టుబడులైనా దిగుబడులు వచ్చినా ధరలు లేక రైతులు పంటను దున్నివేశారు. కనీసం వ్యాపారులు కూడా రాకపోగా వాటిని బయటకు తోలేందుకు అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో రైతులు ఉల్లి సాగుకు భయపడుతున్నారు. ఈ ఏడాది సాగులో పెట్టుబడులవుతున్నా ధరలు లేకపోతే నష్టపోతామనే ఉద్ధేశ్యంతో రైతులు ఉల్లి సాగుకు ఆసక్తి చూపలేదు.


