ప్రొద్దుటూరు : విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు పరిసరాల్లో ఉన్న భూముల్లో విద్యుత్ వైర్లు తగిలి గొర్రెల కాపరి గుజ్జల ఓబులేసు యాదవ్ (35) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గుజ్జల ఓబులేసు యాదవ్ గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. యథావిధిగా ఆదివారం పంట పొలాల్లో గొర్రెలను మేపుతూ ఉండగా విద్యుత్ స్తంభం వద్ద కిందికి వేలాడుతున్న వైర్లు తగిలి అక్కడికక్కడే కాలిపోయాడు. తోడుగా వెళ్లిన మరో గొర్రెల కాపరి గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఓబులేసు యాదవ్ శరీరం పూర్తిగా కాలిపోయే వరకు వైర్లలో విద్యుత్ సరఫరా ఉంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విద్యుత్ సరఫరాను నిలిపివేయించి మంటలను ఆర్పారు. మాజీ సర్పంచ్ కల్లూరు నాగేంద్రారెడ్డి ఈ విషయాన్ని అధికారులకు తెలిపారు. జరిగిన సంఘటనపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ ఓబులేసు యాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణం
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గుజ్జల ఓబులేసు యాదవ్ మృతి చెందాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ పరిసరాల్లోని గతంలో విద్యుత్ సరఫరాను అందించేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. తర్వాత అక్కడ ఎవరూ పంటలు సాగు చేయడం లేదని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించారు. ట్రాన్స్‌పార్మర్‌కు సంబంధించిన విద్యుత్ సరఫరా వైర్లు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. విద్యుత్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. విద్యుత్ శాఖకు సంబంధించిన లైన్‌మెన్ సూర్యం విధులకు గైర్హాజరవుతూ తనకు ప్రత్యామ్నాయంగా గ్రామానికి చెందిన ఏసన్నను నియమించారు. అతను కూడా నిత్యం మద్యం మత్తులో ఉంటూ విధులకు హాజరు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ శాఖ ఈఈ చాంద్ బాషాను వివరణ కోరగా ఓబులేసు యాదవ్ మృతి చాలా బాధాకరమన్నారు. జరిగిన సంఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సంఘటన స్థలాన్ని రూరల్ పోలీసులు పరిశీలించారు.


