ముద్దనూరు, కమలాపురంలో ‘తిరుమల’కు స్టాపేజీ కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ముద్దనూరు, కమలాపురంలో ‘తిరుమల’కు స్టాపేజీ కల్పించాలి

Jul 25 2026 1:47 AM | Updated on Jul 25 2026 1:47 AM

పులివెందుల/ముద్దనూరు: గుంతకల్లు–విశాఖపట్టణం మధ్య ప్రతి రోజూ ప్రయాణించే ‘తిరుమల ఎక్స్‌ప్రెస్‌’ రైలును ముద్దనూరు, కమలాపురం రైల్వే స్టేషన్‌లలో ఆపాలని సౌత్‌ కోస్టల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ను ఎంపీ ఫోన్‌ ద్వారా కోరారు. ఈ రైలు గుంతకల్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు ఎర్రగుంట్లకు, అనంతరం సాయంత్రం 5:38 గంటలకు కడపకు చేరుకుంటుందన్నారు. సాధారణంగా ఎర్రగుంట్ల నుండి కడపకు ప్రయాణించడానికి 30 నిమిషాలు పడుతుందని, కానీ ఈ రైలుకు ఏకంగా 1.38 గంటల సమయం పడుతుండటంతో మధ్యలో చాలా సమయం వృథా అవుతోందని తెలిపారు. ముద్దనూరు, కమలాపురం స్టేషన్ల చుట్టుపక్కల అనేక సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయని, స్థానిక ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తరచుగా ఈ రైలును ఆపాలని గతంలో తనను కోరారని ఎంపీ వివరించారు. కాబట్టి ప్రజాభిప్రాయం, స్థానిక ప్రజల అవసరాల మేరకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ముద్దనూరు, కమలాపురం స్టేషన్లలో హాల్ట్‌ కల్పించాల్సిన అవసరాన్ని పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని రైల్వే జీఎంను అభ్యర్థించారు.

ఎర్రగుంట్ల స్టేషన్‌ను ‘అమృత్‌ భారత్‌’లో చేర్చాలి

ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌ను ‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌’ పథకం కింద ఎంపిక చేసి ఆధునీకరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఆయన రైల్వే మంత్రిని కలిసి ఎర్రగుంట్ల పరిసర ప్రాంతాలలో అనేక సిమెంటు ఫ్యాక్టరీలు ఉండటంతోపాటు ప్రధాన వ్యాపార కేంద్రమైన ప్రొద్దుటూరు పట్టణానికి అతి దగ్గరగా ఈ స్టేషన్‌ ఉన్నందున ప్రయాణీకుల రద్ధీ ఎక్కువగా ఉంటోందని వివరించారు. కడప రైల్వే స్టేషన్‌లో రెండు షిప్టులలో రిజర్వేషన్‌ కౌంటర్‌ ఏర్పాటు చేసి ప్రయాణీకులకు సేవలు అందించాలని లేఖను అందించారు.

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement