భూముల ధరలకు రెక్కలు రావడంతో మనుషుల్లో స్వార్థం పెరిగిపోయి.. అక్రమార్కులు ఏకంగా వందలాది మంది రైతుల పొలాలకు సాగునీరు అందించే చారిత్రక చెరువులనే మింగేస్తున్నారు! బద్వేలుకు సమీపంలోని 128 ఎకరాల ‘గొర్లకుంట’ చెరువులో నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా 30 ఎకరాల ప్రభుత్వ భూమిని నిలువునా స్వాహా చేసేశారు! తూము పూడికతో ఆయకట్టు ఎడారిగా మారడమే అదునుగా భావించి, కబ్జాకోరులు ఏకంగా చెరువు గర్భంలోనే బోర్ బావుల జాతర చేస్తున్నారు.
దురాక్రమణకు గురైన చెరువు
పూడిపోయిన గొర్ల కుంట చెరువు తూం
బద్వేలు: పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. సెంటు స్థలమైనా చాలు ఆక్రమించేందుకు అక్రమార్కులు ఆలోచించడం లేదు. ప్రభుత్వ స్థలాలు, వాగులు, వంకలు ఇలా ఏది అందుబాటులో ఉంటే దాన్ని మింగేస్తున్నారు. తాజాగా బద్వేలు పట్టణానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తిరాజుపల్లె గ్రామానికి చెందిన ‘గొర్లకుంట’ చెరువు దురాక్రమణకు గురికావడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
తూము పూడికతో ఎడారిగా మారిన చెరువు
ఎత్తిరాజుపల్లె పరిధిలోని సర్వే నెంబర్ 40/1లో దాదాపు 128 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ గొర్లకుంట చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువు కింద ఎత్తిరాజుపల్లె, తిమ్మరాజుపల్లె గ్రామాలకు చెందిన రైతులకు 150 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. ఐదేళ్లుగా ఈ చెరువు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. సాగునీరందించే ప్రధాన తూము పూడికతో నిండిపోవడంతో, చెరువులోకి నీరొచ్చే దారి లేక రైతులు తమ పొలాలను ఎండగట్టుకున్నారు. రెండేళ్లుగా చుక్క నీరు లేకపోవడంతో చెరువు ఎడారిలా మారిపోయింది.
30 ఎకరాలు స్వాహా..
చెరువు ఎండిపోవడాన్ని అక్రమార్కులు తమకు అనుకూలమైన అదునుగా భావించారు. ఎత్తిరాజుపల్లెకు చెందిన కొందరు దురాక్రమణదారులు ఏకంగా చెరువు గర్భంలోకి చొరబడి, దాదాపు 30 ఎకరాల మేర ప్రభుత్వ చెరువు భూమిని యథేచ్ఛగా ఆక్రమించేశారు. గ్రామానికి చెందిన ఎర్రగోళ్ల రామసుబ్బయ్య, కుంభగిరి శ్రీను, కుంభగిరి నాగయ్య, దుంపల శ్రీనివాస్‌రెడ్డిలు ఈ దురాక్రమణకు పాల్పడ్డారని స్థానిక ఆయకట్టు రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి ఏకంగా చెరువు గర్భంలోనే బోర్ బావులను తవ్వేసి, పైర్లు కూడా పెట్టుకున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
వినతులు ఇచ్చినా పట్టించుకోని వైనం
చెరువు మరమ్మతుల గురించి, జరుగుతున్న దురాక్రమణ గురించి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా అస్సలు పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా చాలాసార్లు మొరపెట్టుకున్నామని, అయినా వారు కూడా తమ చెరువు వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో ప్రభుత్వ భూముల రీ సర్వే ప్రక్రియ జరుగుతోంది. కాబట్టి ఇప్పటికై నా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి దురాక్రమణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చెరువు పూర్తి విస్తీర్ణానికి పక్కాగా హద్దులు ఏర్పాటు చేసి తమ 150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా చూడాలని ఎత్తిరాజుపల్లె, తిమ్మరాజుపల్లె గ్రామస్తులు, రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
128 ఎకరాల చారిత్రక చెరువులో 30 ఎకరాల స్వాహా!
చెరువు గర్భంలోనే బోర్ల జాతర, పైర్లు
నాటి నీరు మిగులుబాటు.. నేడు కబ్జా!
నా చిన్నతనంలో.. దాదా పు 70 ఏళ్ల కిందట మా గ్రామం గొర్లకుంట చెరువులో నీరు ఆయకట్టు కు ఒక పంటకు పూర్తిగా సరిపడి, ఇంకా నెల రోజుల పాటు నిల్వ ఉండేది. ఇప్పుడు చెరువు కబ్జాకు గురికావడంతో నీరు అస్సలు నిలవడం లేదు. అధికారులు, నాయకులు కలగజేసుకుని చెరువును కబ్జాకోరుల చెర నుంచి విడిపించి మమ్మల్ని ఆదుకోవాలి.– బుసగాని చెన్నయ్య,
రైతు, ఎత్తిరాజుపల్లె, బద్వేలు మండలం.
తూము రిపేరు చేయించండి
చెరువు తూము ఐదేళ్లుగా పూడిపోయింది. దానిని పట్టించుకునే నాథుడే లేడు. అందువల్ల చెరువులో నీరు నిలబడటం లేదు. పైర్లు పెట్టుకున్నప్పుడు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీనిని ఆసరాగా తీసుకుని మా గ్రామస్తులే కొందరు చెరువును ఆక్రమించారు. అధికారులు చర్యలు తీసుకోవాలి.–వెంకటసుబ్బారెడ్డి,
రైతు, ఎత్తిరాజుపల్లె, బద్వేలు
ఆక్రమణలు తొలగించండి
గొర్లకుంట చెరువు రైతులమైన మాకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఆక్రమణకు గురైంది. అక్రమార్కులు ఏకంగా చెరవులోనే బోర్లు వేసుకున్నారు. అధికారులు స్పందించి చెరువును పూర్తి స్థాయిలో కొలతలు వేయాలి. ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకుని రైతులకు ఉపయోగపడేలా చేయాలి.
– ఎన్.వెంకటసుబ్బారెడ్డి, రైతు,
ఎత్తిరాజుపల్లె, బద్వేలు మండలం


