వరుణా.. చూడవా ఇటుకేసీ! | - | Sakshi
Sakshi News home page

వరుణా.. చూడవా ఇటుకేసీ!

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

ఖాజీపేట : వైఎస్సార్‌ కడప జిల్లాలో అత్యధిక శాతం భూములకు జీవనాడి అయిన కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో సాగు పనులు ఊపందుకుంటున్నా, వరుణుడి దోబూచులాటతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకాశం కారుమబ్బులతో నిండుతూ భారీ వర్షం పడుతుందన్న ఆశ కల్పిస్తూనే, నిమిషాల్లో మబ్బులు ముఖం చాటేస్తుండటంతో అన్నదాతలు ఉసూరుమంటున్నారు. అయినప్పటికీ వరుణుడిపై నమ్మకంతో వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతున్నారు.

శ్రీశైలంలో నీటి ఎద్దడి – ఆగస్టులోనే స్పష్టత

శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 220 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 40 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జలాశయం డెడ్‌ స్టోరేజీకి చేరుకోవడంతో కేసీ కాలువకు సాగునీరు వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో రైతులు వరికి బదులు ఆరుతడి పంటల సాగు వైపే మొగ్గు చూపాలని అధికారులు పరోక్షంగా సూచిస్తున్నారు. కాలువకు నీటి విడుదల విషమై జులై చివరన గానీ, ఆగస్టు మొదటి వారంలో గానీ అధికారులు ప్రత్యేక సమావేశం కానున్నారు. ఆ తర్వాతే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని, ఆగస్టులోనే సాగునీటిపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు.

ప్రసిద్ధ కేంద్రంలో జోరందుకున్న విత్తన విక్రయాలు

వరి విత్తన వడ్ల అమ్మకాలకు ఖాజీపేట కేంద్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. జూన్‌ 1న ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల రైతులు సైతం ఇక్కడికి వచ్చి కేఎన్‌ఎం–1638, బీపీటీ–5204, జేజీఎల్‌–384 వంటి రకాల విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే గతేడాది రూ.1200 నుంచి రూ.1250 ఉన్న బస్తా ధర, ఈ ఏడాది ఏకంగా రూ.1300 నుంచి రూ.1400 వరకు పెరిగిందని, ప్యాకెట్‌కు రూ.100 నుండి రూ.200 వరకు అదనపు భారం పడిందని రైతులు వాపోతున్నారు. దీనికితోడు సాగుకు ముందే వేసే పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుముల సబ్సిడీ కోటాను అధికారులు బాగా తగ్గించారని, గత రెండేళ్లుగా పిల్ల పెసర విత్తనాలను ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ సరిపోక బహిరంగ మార్కెట్‌లో విత్తనాలను అధిక ధరలకు కొనాల్సి వస్తోందని వాపోతున్నారు.

జలాశయాల నీటి కోసం ఎదురుచూపు

మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, మైదుకూరు మండలాల పరిధిలోని 92 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు కేసీ కాలువే ప్రధాన వనరు. ఈ కాలువకు నీరొస్తే రెండు పంటలు పుష్కలంగా పండుతాయని, అందుకే ఈ ప్రాంతాన్ని నిపుణులు ’మరో కోనసీమ’గా పిలుస్తారని రైతులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం రాజోలి జలాశయానికి ఎప్పుడు నీరు వస్తుందా అని రైతులు కోటి ఆశలతో పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిధిలోని చెరువులన్నీ కేసీ కాలువ నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. అవి నిండితేనే ఆయకట్టు సాగు సాధ్యమవుతుంది. కాగా, పెన్నా, కుందూ నదీ పరివాహక ప్రాంతాల రైతులు ఇప్పటికే వరి నార్లు పోసి సాగుకు సిద్ధమవగా.. కాలువ నీటిపై నమ్మకం లేని కొందరు రైతులు బోర్ల కింద వరితో పాటు ఆరుతడి పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికై నా వరుణుడు కరుణించి, అధికారులు సాగునీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతాంగం వేడుకుంటోంది.

శ్రీశైలంలో అడుగంటిన నీరు.. కేసీ ఆయకట్టు రైతుల తిప్పల తీరు

ఖరీఫ్‌ ప్రారంభంతో ఖాజీపేటలో జోరుగా విత్తన విక్రయాలు

ధరల భారంపై అన్నదాతల ఆవేదన

నీటి విడుదలపై ఆగస్టులోనే స్పష్టత

ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలని అధికారుల సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement