కూటమి సీట్లో కుంపట్లు ! | - | Sakshi
Sakshi News home page

కూటమి సీట్లో కుంపట్లు !

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

ప్రొద్దుటూరు:ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు, ముఠా కక్షలు పరాకాష్టకు చేరాయి. నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చేసిన ఘాటు వ్యాఖ్యలు, హెచ్చరికలు స్థానిక అధికార కూటమిలో భూకంపం సృష్టించాయి. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం రక్తం చెమటోడ్చిన నిజమైన కార్యకర్తలను తొక్కుకుంటూ, ఏకపక్ష రాజకీయం నడుపుతున్న ఆరోసారి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వైఖరిపై లోకేష్‌ వేదికపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేదికపైనే లోకేష్‌ ‘గేట్‌ పాస్‌’ వార్నింగ్‌

‘కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుని, కలుపుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిదే’ అని లోకేష్‌ స్పష్టం చేశారు. వరదరాజులరెడ్డి తన పక్కనే వేదికపై కూర్చొని ఉండగానే లోకేష్‌ అసలు ట్విస్ట్‌ ఇస్తూ.. ’ ఒకవేళ అందరినీ కలుపుకొని వెళ్లడం చేతకాకపోతే, అలాంటి వారు పార్టీ వదిలి బయటకు వెళ్లడానికి టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయ్ఙి అంటూ ‘గేట్‌ పాస్‌’ హెచ్చరిక ఇవ్వడం సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు తనకు టికెట్‌ ఇవ్వలేదన్న కోపంతో, వరదరాజులరెడ్డి బహిరంగంగా టీడీపీ జెండాలను తగలబెట్టించిన ఉదంతం అందరికీ తెలుసు. 2024 ఎన్నికల ముందు వచ్చి టికెట్‌ దక్కించుకుని గెలిచారు. కానీ, గెలిచినప్పటి నుండి పాత తమ్ముళ్లను పక్కన పెట్టడంపై క్యాడర్‌ లోకేష్‌ దృష్టికి ఆవేదనను తీసుకెళ్లింది.

గ్రూపుల కుమ్ములాటలు.. వేర్వేరుగా ఆఫీసులు!

వరదరాజులరెడ్డి మొదటి నుంచీ తనదైన ఏకపక్ష శైలితో వ్యవహరిస్తారనే ముద్ర ఉంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా నెహ్రూ రోడ్డులోని తన సొంత కార్యాలయమే పార్టీ ఆఫీస్‌గా నడుస్తుంటుంది. పార్టీలో ప్రతి ఒక్కరూ తాను చెప్పినట్లే వినాలనే మనస్తత్వం వల్లే ప్రొద్దుటూరులో టీడీపీ గ్రూపుల వారీగా విడిపోయింది. పార్టీ ఉమ్మడి కడప జిల్లాకు రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డిని వరదరాజులరెడ్డి ఏనాడూ కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కారణంగానే మల్లెల లింగారెడ్డి, వరదరాజులరెడ్డి వేర్వేరుగా కార్యాలయాలను నడుపుతున్నారు.

ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి పదవి గండం..

మరోవైపు నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఐదేళ్లూ పార్టీ కోసం తీవ్రంగా శ్రమించి, గత ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కుతుందని ప్రచారం సాగింది. అయితే, ఎన్నికల సమయంలో ప్రవీణ్‌ పార్టీ అభ్యర్థి విజయానికి సహకరించలేదని, లోపాయికారీగా వ్యతిరేకంగా పనిచేశారని వరదరాజులరెడ్డి వర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల కూటమి ముఖ్య నేతలు అమరావతికి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆయనకు పదవి రాకుండా పోయింది. దీంతో ప్రవీణ్‌ నిరంతరం చంద్రబాబు, లోకేష్‌లను కలుస్తూ తనపై ఉన్న వ్యతిరేక ముద్రను చెరిపేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

పరాకాష్టకు చేరిన కక్షలు..

తమ పదవిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డిపై ప్రవీణ్‌కుమార్‌రెడ్డి బహిరంగంగానే ఎదురుదాడికి దిగారు. కొండారెడ్డికి చెందిన శ్రీఎస్‌ఎస్‌ మాల్‌శ్రీ, శ్రీసన్‌రైజ్‌ కౌంటీశ్రీలపై ప్రవీణ్‌ ఫిర్యాదు చేయడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలకు వచ్చారు. సొంత పార్టీ నేతే తమ వ్యాపారాలపై అధికారులను ఉసిగొల్పడాన్ని జీర్ణించుకోలేని వరదరాజులరెడ్డి ముఖ్య అనుచరులు నేరుగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇంటిపైకి వెళ్లి రాళ్లతో దాడికి తెగబడ్డారు.

తమ్ముళ్లలో అయోమయం..

కార్యకర్తల సమావేశానికి ప్రవీణ్‌ ఆహ్వానించిన పాత కార్యకర్తలను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర దుమారం రేపింది. లోకేష్‌ ఇచ్చిన వార్నింగ్‌ తర్వాత ప్రొద్దుటూరు తమ్ముళ్లలో సరికొత్త చర్చ మొదలైంది. ఇప్పటివరకు వేర్వేరు వర్గాలుగా విడిపోయిన ముగ్గురు నేతలు ఇకనైనా కలిసి నడుస్తారా? అది సాధ్యమేనా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ పాత కక్షల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో క్యాడర్‌ ఎవరి వెంట నడవాలో తెలియక తీవ్ర అయోమయంలో కొట్టాడుతోంది.

టీఢీపీ

ప్రొద్దుటూరు: పట్టణ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సబ్‌ స్టేషన్‌ నిర్మాణ స్థల వివాదం తారస్థాయికి చేరుకుంది. స్థానిక శ్రీనివాసనగర్‌లోని ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు నిధులు మంజూరు చేసి, సగం పనులు పూర్తి చేశారు. అయితే, ఈ స్థలం ప్రైవేట్‌ వ్యక్తులదని, ఇక్కడ నిర్మాణం చేపట్టవద్దని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి పార్టీ పెద్దలకు విన్నవించారు.

ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సవిత ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల పనులను నిలిపివేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, పనులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో శనివారం ఉదయం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వివాదంపై విద్యుత్‌ శాఖ డీఈ చాంద్‌ బాషా మాట్లాడుతూ సదరు స్థలం ఎవరిదనేది తేల్చి, హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం పోలీస్‌, రెవెన్యూ, విద్యుత్‌ అధికారులు ఆగిన పనులను పరిశీలించి చర్చించారు.

ప్రొద్దుటూరు టీడీపీలోపచ్చగడ్డి వేస్తే భగ్గు

లోకేష్‌ ‘గేట్‌పాస్‌’ హెచ్చరికతో టీడీపీ కకావికలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement