పై ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం ఏదో మైదానంలో పర్చిన రంగుల తివాచీ కాదు.. అది ఉరకలేయాల్సిన కుందూనది గర్భం! వెల్లాల గ్రామ సమీపంలోని కుందూనదిలో బుధవారం నాడు కనిపించిన హృదయవిదారక చిత్రమిది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో నది పూర్తిగా ఎండిపోయింది. ఎక్కడో ఒకచోట నిలిచిన కాస్త నీటిలోనే బట్టలు ఉతుక్కున్న రజకులు.. ఆరబెట్టుకోవడానికి చోటు లేక ఏకంగా నది గర్భంలోని రాళ్లపైనే బట్టలను ఇలా ఆరవేసుకున్నారు. ఈ దారి గుండా వెళ్లే ప్రయాణికులు నది వైపు చూస్తూ ఆవేదన చెందుతున్నారు. గతేడాది జూలై 9వ తేదీ నాటికే రాజోలి ఆనకట్టకు వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో కుందూనదితో పాటు కేసీ కెనాల్, చాపాడు ప్రధాన కాలువలు నిండుకుండలా కళకళలాడాయి. కానీ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా చుక్క వాన పడకపోవడంతో జలాశయాలన్నీ ఇదిగో ఇలా జీవచ్ఛవంలా మారాయి. – రాజుపాళెం


