● ముస్లిం సోదరుడి ఉదారత..
● గుడికి రూ. లక్ష విరాళం!
పులివెందుల టౌన్: కులాలు, మతాల కంటే మానవత్వం, దైవచింతన మిన్న అని చాటుతూ భారతదేశ పరమత సహనానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ఒక అద్భుత ఉదాహరణగా నిలిచారు ఒక ముస్లిం సోదరుడు. హిందూ–ముస్లిం భాయ్–భాయ్ అనే సాంప్రదాయాన్ని నిజం చేస్తూ శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ఆయన లక్ష రూపాయల భారీ విరాళాన్ని అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ౖ తొండూరు మండలం అగడూరు గ్రామానికి చెందిన రిటైర్డు టీచర్, ముస్లిం సోదరుడు ఇమామ్ సాహేబ్.. పులివెందుల నగరంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని విరాళంగా ప్రకటించారు. శుక్రవారం ఆయన ఈ నగదును ఆలయ కమిటీ సభ్యులకు నేరుగా అందజేశారు. ఈ సందర్భంగా ఇమామ్ సాహెబ్ మతసామరస్య ఉదారతను ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులుకొనియాడారు. అనంతరం ఇమామ్ సాహెబ్ కుటుంబ సభ్యులకు ఆంజనేయస్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ అర్చకులు వారికి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు.


