● ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్న పాఠశాలలు
● బడి బస్సులను తనిఖీ చేస్తున్న
రవాణాశాఖ
● అన్నీ సక్రమంగా ఉంటేనే
ఎఫ్‌సీ ఇస్తామంటున్న అధికారులు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: వేసవి సెలవులకు బైబై చెప్పే సమయం ఆసన్నమైంది.. పిల్లలు బడిబాట పట్టే వేళయింది. పిల్లలే కాదు వారిని తీసుకెళ్లే బస్సులు కూడా సిద్ధం కావాల్సిన తరుణం రానే వచ్చింది. అవును.. రవాణాశాఖ ఆధ్వర్యంలో అన్ని సామర్థ్య పరీక్షలు చేసుకుని బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. కాగా గత ఏడాది జారీ చేసిన సర్టిఫికెట్లకు కాలం చెల్లడంతో ప్రస్తుతం జిల్లాలో ఈ ప్రక్రియ జరుగుతోంది. విద్యా సంస్థలకు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు పూర్తి కండీషన్‌లో ఉన్నాయో లేదో అధికారులు తనిఖీ చేస్తున్నారు.
ఏటీసీ సెంటర్ ద్వారా ఎఫ్‌సీలు జారీ
గతంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ప్రతి వాహనాన్ని ఒకటి రెండు కిలోమీటర్లు నడిపి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేసేవారు. ఈ పనిని బాబు సర్కారు ఈ ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. జిల్లాకు సంబంధించి వైవీయూ యూనివర్శిటీ సమీపంలో ఏటీఎస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలోని అన్ని మండలాల నుంచి బడి బస్సులను ఇక్కడికే తీసుకువచ్చి ఎఫ్‌సీ పొందాల్సి వస్తోంది. ఈ ఏటీఎస్ సెంటర్‌పై ఏమాత్రం అజమాయిషీ లేకపోవడంతో రవాణాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఉదయం ఆరు గంటలకు బస్సు తీసుకొని వస్తే రాత్రి 9 గంటలైనా పని పూర్తి కావడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు నానా అవస్థలు పడుతున్నారు.
ఇప్పటివరకు 460 బస్సులు తనిఖీ
జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్, ప్రాంతాల్లో దాదాపు 618 పైగా విద్యా సంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 460 బస్సులను తనిఖీ చేశారు. వీటిలో 92 బస్సులకు ఎఫ్‌సీలు జారీ చేశారు. బడి బస్సులో లోపాలు ఉన్న 368 బస్సులకు నోటీసులు ఇచ్చారు.
గుర్తిస్తున్న లోపాలు ఇవీ......
రవాణా శాఖ తనిఖీల్లో వీఎల్‌టీడీ డివైజ్‌లు లేకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలు బయ టకు వచ్చే అత్యవసర ద్వారాలు సరిగా పని చేయకపోవడం, అత్యవసర ద్వారాల వద్ద సీట్లు అమర్చడం వంటి లోపాలు అధికారులు గుర్తించి నోటీసులు ఇస్తున్నారు. మంటలను ఆర్పే ఫైర్ ఎక్విప్ మెంట్ లేకపోవడం, ఎక్స్‌పైరీ డేట్‌తో ఉండటం వంటి వాటిని అధికారులు గుర్తిస్తున్నారు
● స్కూల్ బస్సుకు డ్రైవర్‌గా
60 ఏళ్లు నిండిన వారు అనర్హులు
● బస్సు నడిపే డ్రైవర్‌కు బీపీ, షుగర్, కంటి
సంబంధిత సమస్యలు లేవని
సర్టిఫికెట్ సమర్పించాలి.
● డ్రైవర్ నియామకాన్ని ఆర్‌టీఓ
అధికారులకు తప్పనిసరిగా తెలియ
జేయాలి. డ్రైవర్లకు ఐదేళ్ల అనుభవం,
హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
● కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపల్
విద్యార్థుల తల్లిదండ్రులతో కూడిన కమిటీ
ఏర్పాటు చేయాలి. ప్రతి నెల వాహనం
ిస్థితి గతులను నమోదు చేయాలి.
ఫిర్యాదు పుస్తకం ఉండాలి.
● బస్సులోని అన్ని లైట్లు, సిగ్నల్స్
ఖచ్చితంగా పని చేయాలి.
● బ్రేకులు కండీషన్‌లో ఉండాలి
● ఎమర్జెన్సీ డోర్, అగ్ని ఆర్పే పరికరం,
ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలి
విద్యా సంస్థల బస్సులకు తప్పనిసరిగా ఎఫ్‌సీ కలిగిఉండాలి. దీనిపై ఇప్పటికే జిల్లాలోని విద్యా సంస్థలకు సమాచారం ఇచ్చాం. ఎఫ్‌సీ లేకుండా విద్యార్థులను తీసుకెళ్లినా, నిబంధనలు పాటించకపోయినా బస్సులను సీజ్ చేసి జరిమానా విధిస్తాం. వీటిపై ప్రత్యేక బృందాలను నియమించాం.
– వీర్రాజు, ఇన్‌చార్జ్ ఉప రవాణా శాఖ కమిషనర్, వైఎస్‌ఆర్ జిల్లా


