● పరివాహక ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి
● ఇసుక తోడేస్తుండటంతో
దెబ్బతింటున్న తాగునీటి పైపులైన్
● ఐదు ట్రాక్టర్లు సీజ్ చేసిన అధికారులు
ట్రాలీని వదిలి ఇంజన్‌తో పరారైన ఇసుకాసురులు
ట్రాక్టర్లను సీజ్ చేస్తున్న అధికారులు
ఎర్రగుంట్ల : జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల పరిధి పోట్లదుర్తి గ్రామంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పెన్నానదిలోని ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. దీంతో సమీప గ్రామాలకు వెళ్లే తాగునీటి పైపులైన్లు పగిలిపోయి నీటి ఎద్దడి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రొద్దుటూరు, యర్రగుంట్ల ప్రాంతాలకు అధికార పార్టీ అండదండలతో వారి అనుచర వర్గీయులే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పోట్లదుర్తి గ్రామ సమీపంలోని బ్రిడ్జి సమీంలోనే ఇసుకను తోడేశారు. దీంతో ఎక్కడ పడితే అక్కడ పెన్నానది అంతా గుంతలు పడింది. అడుగుభాగాన ఉన్న ఇసుకను తోడేయడంతో మట్టి మాత్రం నదిలో మిగిలింది.
అధికారుల రాకతో పరుగులు
పెన్నానదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రని గ్రామంలోని కొందరు బుధవారం రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో తహసీల్దార్ అమరేశ్వరీ ఆదేశాల మేరకు ఆర్‌ఐ ప్రమీల వీఆర్‌ఓ పెన్నానదిలోకి వెళ్లి దాడులు చేశారు. తర్వాత పోలీసులు వచ్చారు. అధికారులు వస్తున్నారని తెలిసి ఇసుక అక్రమరవాణాదారులు ట్రాక్టర్లను వదిలి పరుగులు పెట్టారు. నదిలో ఉన్న ఐదు ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు.
అడుగంటిపోతున్న భూగర్భజలాలు...
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్నానదిలోని ఇసుకపై అధికార పార్టీ నాయకుల అనుచర వర్గీయుల కన్నుపడింది. దీంతో ఇసుకను ఇష్టరాజ్యంగా తోడేస్తున్నారు. ఈ కారణంగా పైపులైన్ దెబ్బతినడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. గ్రామాల్లో తీవ్రంగా నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ప్రొద్దుటూరు నుంచి అధికంగా ఇసుక మాఫియ దారులు పెన్నానదిలోని ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల నియంత్రణ లేకపోవడంతో ఇసుక బయట ప్రాంతాలకు తరలిపోతోంది.


