వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై ఆది వర్గీయుల దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై ఆది వర్గీయుల దాడి

Jun 11 2026 12:25 AM | Updated on Jun 11 2026 12:25 AM

జమ్మలమడుగు/ఎర్రగుంట్ల: జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి తెగబడ్డారు. కత్తులు, రాళ్లతో వీరంగం సృష్టించారు. ఈ దాడిలో ఎర్రగుంట్లకు చెందిన మేకల ప్రసాద్‌రెడ్డి, ఆయన తల్లి మేకల వరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు.. మాలేపాడులోని సర్వే నంబర్‌ 373లో 86 సెంట్ల స్థలాన్ని 2013లో ప్రసాద్‌రెడ్డి తండ్రి మేకల సుబ్బిరెడ్డి రూ.90 వేలకు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులో పంట సాగు చేసుకుంటున్నారు. అయితే, ఈ భూమిని ఎవరికీ తెలియకుండా ప్రొద్దుటూరుకు చెందిన టంగుటూరు మారుతీప్రసాద్‌, రావుశ్రీ అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అనంతరం ప్రొద్దుటూరు మండలంలోని రామాపురానికి చెందిన పైడికాలువ జగన్‌కు విక్రయించారు. బాధితులు 2015లో దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్‌ పత్రాలలో తామే అనుభవంలో ఉన్నామని ప్రసాద్‌రెడ్డి ఆధారాలతో సహా నిరూపించుకోగా, ఆ భూమి ప్రసాద్‌రెడ్డిదేనని అధికారులు తేల్చారు. ఈ క్రమంలో బుధవారం కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు పైడికాలువ జగన్‌, ఆయన తండ్రి ఓబన్న అలియాస్‌ జయన్న, పైడికాలువ ప్రసాద్‌, ఎర్రమాసి ప్రతాప్‌, పైడికాలువ భరత్‌ మరో 20 మంది కలిసి మారణాయుధాలతో భూమిలో దిగారు. ప్రసాద్‌రెడ్డి తల్లి వరలక్ష్మి వారికి అడ్డుచెప్పగా వారు ఆమైపె తీవ్రంగా దాడి చేశారు. విషయం తెలుసుకున్న ప్రసాద్‌రెడ్డి ప్రొద్దుటూరు నుంచి నేరుగా ఇంటికి రాగా, ఎమ్మెల్యే వర్గీయులు ఆయనపైనా దాడి చేశారు. కాగా, గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పరామర్శించారు.

ఎర్రగుంట్లకు చెందిన మేకల ప్రసాద్‌రెడ్డి,

ఆయన తల్లికి తీవ్రగాయాలు

Advertisement
 
Advertisement
Advertisement