కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఆ సమయాల్లో ప్రత్యేక నిఘా, పటిష్ట ట్రాఫిక్ అమలు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 51 బ్లాక్ స్పాట్‌లు, 125 జీరో ఫెటాలిటీ క్రాష్ ప్రోన్ ప్రాంతాలు, 162 యాక్షనబుల్ ప్రదేశాల వద్ద తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కఠినతరం చేయాలని అధికారులకు సూచించారు. డివైడర్లను పగలగొట్టి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో అధిక జనసంచారం ఉన్న ప్రాంతాల్లో రోడ్డు భద్రతా చర్యల్లో మున్సిపల్ కమిషనర్లు కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


