అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన బిడ్డ.. ముళ్లపొదల్లో చేరి మృత్యు కౌగిట్లో జారిపోయాడు.. తండ్రి చేతుల్లో పెరగాల్సిన బిడ్డ.. శునకాల నోట చిక్కి విలవిల్లాడిపోయాడు.. ఎవరి పాపమో.. విధి శాపమో గానీ.. కళ్లు తెరవకుండా శాశ్వతంగా కన్నుమూశాడు..
కడప వినాయకనగర్ సమీపంలో ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిన హృదయ విదారక ఘటన కలిచివేస్తోంది. వినాయకసాగర్ ముళ్లపొదల సమీపంలో కుక్కలు ఓ పసికందును నోట కరుచుకుని తీసుకెళ్తుండటాన్ని గమనించారు. తీవ్ర గాయాలతో అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం తాలూకా పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ ఆదేశాల మేరకు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్‌ఐ తెలిపారు. – కడప అర్బన్


