ప్రధాన క్రికెట్‌ బుకీలపై చర్యలేవీ..? | - | Sakshi
Sakshi News home page

ప్రధాన క్రికెట్‌ బుకీలపై చర్యలేవీ..?

Jun 11 2026 12:25 AM | Updated on Jun 11 2026 12:25 AM

ప్రొద్దుటూరు క్రైం : ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు రెండు నెలల పాటు జరిగాయి. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కాకమునుపే పోలీసులు బెట్టింగ్‌ రాయుళ్ల కదలికలపై దృష్టి సారించారు. అన్ని స్టేషన్‌ల పరిధిలోని బుకీలను పిలిపించి స్వయంగా ఏఎస్పీ విభూకృష్ణ కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఐపీఎల్‌ ప్రారంభం అయ్యేనాటికే రెండు, మూడు సార్లు కౌన్సిలింగ్‌ ఇచ్చి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ కౌన్సిలింగ్‌కు ప్రధాన బుకీలెవ్వరూ హాజరు కాలేదు. చిన్నా చితకా క్రికెట్‌ పందేలు నిర్వహించే బుకీలు మాత్రమే కౌన్సిలింగ్‌కు వచ్చారు. ఈ ఏడాది మార్చి 28న ప్రారంభమైన ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు మే 31న ముగిశాయి. ప్రధాన బుకీలందరూ ఇతర దేశాలకు వెళ్లారు. అక్కడే ఉంటూ రెండు నెలల పాటు నిర్విరామంగా బెట్టింగ్‌ నిర్వహించారు. టోర్నమెంట్‌ ముగియడంతో కౌన్సిలింగ్‌కు డుమ్మా కొట్టిన వారు, పోలీసుల లిస్టులో వాంటెడ్‌గా ఉన్న బుకీలు ఇప్పుడిప్పుడే సొంత గూటికి వస్తున్నారు.

ఐపీఎల్‌ సీజన్‌లో అదృశ్యం..

సీజన్‌ ముగియగానే ప్రత్యక్షం..

ప్రొద్దుటూరులో క్రికెట్‌ బెట్టింగ్‌్‌ అనేది ఈ రోజు పుట్టింది కాదు. ఇక్కడ క్రికెట్‌ పందేలను ప్రారంభించిన అనేక మంది బెట్టింగ్‌ డాన్‌లుగా ఎదిగారు. వీరి నీడన రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది బుకీలు పని చేస్తున్నారు. ప్రొద్దుటూరు విషయానికొస్తే అధికార పార్టీలో ఉంటున్న కొందరు బుకీలు స్థానికంగా చక్రం తిప్పుతున్నారు. నిన్న మొన్నటి వరకు సబ్‌బుకీలు, కొరియర్‌ బాయ్‌లుగా ఉన్న యువకులు నేడు బడా బుకీలుగా మారారు. జిన్నారోడ్డుకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి సోదరుడి కుమారుడు బెట్టింగ్‌ కార్యకలాపాలను విస్తరించాడు..ఇతను కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన ప్రధాన బుకీతో కలిసి పెద్ద ఎత్తున క్రికెట్‌ పందేలు నిర్వహిస్తున్నాడు. వన్‌టౌన్‌ ప్రాంతంలో ఒకరు, బంగారు అంగళ్ల వీధిలో ఒక యువబుకీ, మైదుకూరు రోడ్డుకు చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి, అతని సోదరుడు క్రికెట్‌ పందేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పొలిటికల్‌ అండతో ప్రొద్దుటూరులో అనేక మంది బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కాగానే వీళ్లంతా కువైట్‌, దుబాయ్‌, మస్కట్‌, శ్రీలంక తదతర దేశాలకు వెళ్లిపోయారు. అక్కడి నుంచే యాప్‌ల ద్వారా, ఫోన్లలోనూ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించేవారు. పోలీసుల భయంతో రెండు నెలల పాటు ఇతర దేశాల్లో బెట్టింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తూ బిజీగా గడిపారు. ఇటీవలే ఐపీఎల్‌ సీజన్‌ ముగియడంతో తిరిగి ఒక్కొక్కరుగా ప్రొద్దుటూరుకు వస్తున్నారు.

నాడు పోలీసుల భయంతో పారిపోయినోళ్లే.. నేడు పోలీసుస్టేషన్ల ముందే ఫోజులు కొడుతున్నారు

ఐపీఎల్‌, టీ ట్వంటి వరల్డ్‌కప్‌ లాంటి క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో వారం రోజులు ముందే క్రికెట్‌ బుకీలు వారెంచుకున్న ప్రాంతాలకు వెళ్లిపోతారు. క్రికెట్‌ మ్యాచ్‌ల ముందు పోలీసులు పట్టుకుంటే బెట్టింగ్‌ నిర్వహించుకునేందుకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ముందుగా స్థావరాలకు చేరుకుంటారు. ఒక వేళ క్రికెట్‌ సీజన్‌ ప్రారంభమైనా బిక్కు బిక్కుమంటూ పోలీసులకు కనిపించకుండా దాక్కొని తిరుగుతుంటారు. క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఫోన్‌ నంబర్లను మార్చుకొని పందేలు నిర్వహిస్తుంటారు. పోలీసులు సాంకేతికత ఆధారంగా గుర్తిస్తారేమోననే భయంతో కొత్త సిమ్‌ కార్డులను తీసుకొని తమ కార్యకలాపాలు కొనసాగిస్తారు. క్రికెట్‌ మ్యాచ్‌లు ముగిసిన వెంటనే బుకీలు ఇక్కడికి వచ్చి రాజకీయ కార్యకలాపాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. రెండు నెలల క్రితం వరకు పోలీసులను చూస్తే భయపడిన బుకీలే ఇప్పుడు ఒక్కసారిగా ప్రత్యక్షమై పోలీసుల ముందే జెంటిల్‌మెన్‌లా తిరుగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా అక్రమ క్రికెట్‌ బెట్టింగ్‌పై పోలీసులు, నిఘా సంస్థలు ఎంత మేరకు పర్యవేక్షణ చేస్తున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. క్రికెట్‌ సీజన్‌లో నీడలా మాయమై..ఫైనల్‌ మ్యాచ్‌ ముగిశాక ప్రత్యక్షమయ్యే ఈ జెంటిల్‌మెన్‌ల వ్యవహారంపై ఆయా పోలీస్‌స్టేషన్ల పోలీసు అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా అధికార పార్టీకి చెందిన క్రికెట్‌ పందేలు నిర్వహించే కొందరు వ్యక్తులు, మాజీ ప్రజాప్రతినిధులు పోలీస్‌స్టేషన్‌లకు వెళ్లి పంచాయతీలు కూడా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారాల్లో పాల్గొంటున్న వ్యక్తులతో కొందరు పోలీసు సిబ్బంది సన్నిహితంగా కనిపించడం ప్రొద్దుటూరులో పరిపాటిగా మారుతోంది.

పలువురు ప్రధాన బుకీలపై కేసులు..?

ఐపీఎల్‌ క్రికెట్‌ సీజన్‌లో ప్రొద్దుటూరు పోలీసులు పలువురు క్రికెట్‌ బుకీలను అరెస్ట్‌ చేశారు. టూ టౌన్‌ పోలీసులు 13 మంది క్రికెట్‌ బుకీలను అరెస్ట్‌ చేసి రూ.11 లక్షలుపైగా స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన బుకీలు షేక్‌ జావిద్‌ అలియాస్‌ బాలాజీ, అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ సోదరుడు షేక్‌ జిలానిబాషాలు అరెస్ట్‌ చేయడంతో పాటు బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న మరో రూ. 14 లక్షలను జప్తు చేశారు. అలాగే వన్‌టౌన్‌ పోలీసులు ఆరుగురు బుకీలను అరెస్ట్‌ చేసి రూ. 2.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న రూ. 4.14 లక్షలను కూడా ఫ్రీజ్‌ చేశారు. ఈ రెండు స్టేషన్లలో నమోదైన బెట్టింగ్‌ కేసుల్లో పలువురు ప్రధాన బుకీలకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని పలువురు ప్రధాన బుకీలపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కారణంగా 5–6 మంది ప్రధాన బుకీలు ఇప్పటికీ అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం.

ఐపీఎల్‌ సీజన్‌లో అదృశ్యం..

సీజన్‌ ముగియగానే ప్రత్యక్షం

రెండు నెలల పాటు విదేశాల్లో మకాం వేసిన క్రికెట్‌ బుకీలు

ఇటీవల ఐపీఎల్‌ సీజన్‌ ముగియడంతో సొంతగూటికి పయనం

క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో

పోలీసుల లిస్టులో వాంటెడ్‌గా ఉన్న బుకీలే..

నేడు పెద్ద మనుషులుగా, సమాజ

సేవకులుగా చలామణి

మోస్ట్‌ వాంటెడ్‌ బుకీలపై పోలీసులు చర్యలు తీసుకుంటారా..!

Advertisement
 
Advertisement
Advertisement