బాబు పేరు చెబితే మోసం గుర్తుకువస్తుంది | - | Sakshi
Sakshi News home page

బాబు పేరు చెబితే మోసం గుర్తుకువస్తుంది

Jun 11 2026 12:25 AM | Updated on Jun 11 2026 12:25 AM

12న చేపట్టే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలి

వైఎస్‌ఆర్‌సీపీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌

మెంబర్‌ కె.సురేష్‌ బాబు

కడప కార్పొరేషన్‌ : ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేది నిర్వహించనున్న నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని ఆ పార్టీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ కె. సురేష్‌ బాబు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక అపూర్వ కళ్యాణ మండపంలో పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది పింఛన్లు తప్పా మరేమీ ఇవ్వలేదన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, అతి కొద్దిమందికి మాత్రమే ఇచ్చారన్నారు. పింఛన్‌ రూ.4వేలకు పెంచి 5లక్షల పింఛన్లు కోత కోశారన్నారు. అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చి రూ.13వేలే ఇస్తున్నారన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. 20లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పారన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని కేవలం 5 సర్వీసుల్లోనే అమలు చేస్తున్నారన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. వైఎస్సార్‌ పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని, చంద్రబాబు పేరు చెబితే మోసం, దగా, అబద్ధాలు గుర్తుకు వస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈనెల 12వ తేదీ భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్‌, ఎన్‌టీఆర్‌ సర్కిల్‌, ఏడురోడ్ల కూడలి మీదుగా ఆర్‌డీఓ కార్యాలయం వరకూ కొనసాగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌, ఎస్‌ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, క్లస్టర్‌ పార్టీ అధ్యక్షులు పి. రామ్మోహన్‌రెడ్డి, బీహెచ్‌ ఇలియాస్‌, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్‌, మున్సిపల్‌ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement