పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం బ్రాహ్మణపల్లె రోడ్డులోని జూదస్థావరంపై ఎస్‌ఐ తిమోతి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో మొత్తం 8 మంది జూదరులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.10,030 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు చేపట్టగా, నిందితులు పట్టుబడ్డారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తామని ఎస్‌ఐ తిమోతి పేర్కొన్నారు.
గొర్రెల చోరీపై కేసు నమోదు
ప్రొద్దుటూరు క్రైం : గొర్రెలు చోరీ చేసిన ఘటనపై బుధవారం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని గోపవరం గ్రామంలో రేకుల షెడ్డును కత్తిరించి అందులో ఉన్న 13 గొర్రెలు నిందితులు చోరీ చేశారు. గొర్రెలను నిందితులు బొలెరో వాహనంలో తీసుకెళ్లినట్లు బాధితుడు అనిల్‌కుమార్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గొర్రెలు విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందన్నారు. నిందితులు బనగానపల్లెలో వాసులుగా గుర్తించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ రాజు తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామానికి చెందిన ఎస్ గౌస్‌పీర్(31) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని యర్రగుంట్ల సీఐ విశ్వనాథ్‌రెడ్డి బుధవారం తెలిపారు. చిలంకూరు గ్రామానికి చెందిన ఎస్ గౌస్‌పీర్, గురుశేఖర్‌లు చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చేపలను నిల్వ చేసుకోవడానికి ఐస్ కోసమని ఇద్దరు కలసి ఈ నెల 8వ తేదీన స్కూటర్‌పై చెన్నూరుకు బయలుదేరారు. తిరిగి వస్తుండగా తిప్పలూరు గ్రామంలోని సచివాలయం వద్దకు రాగానే తుఫాన్ వాహనం వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎస్ గౌస్‌పీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసమని కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు.
వృద్ధుడు అదృశ్యం
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని బొల్లవరానికి చెందిన వృద్ధుడు పందిటి సామేల్ (80) అదృశ్యంపై త్రీ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సామేల్ తమిళనాడులోని వేళాంగినికి వెళ్తున్నానని చెప్పి ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ రోజు వెళ్లిన అతను ఇంత వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఊళ్లలోనూ, తెలిసిన చోట్ల వెతికినా అతని ఆచూకీ తెలియలేదు. త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


