రోబోటిక్‌ ల్యాబ్‌ను పరిశీలించిన డీఈఓ | - | Sakshi
Sakshi News home page

రోబోటిక్‌ ల్యాబ్‌ను పరిశీలించిన డీఈఓ

Jun 11 2026 12:25 AM | Updated on Jun 11 2026 12:25 AM

రాజంపేట టౌన్‌ : పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్‌ ల్యాబ్‌ను బుధవారం డీఈఓ షంషుద్దీన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. ఈరోబోటిక్‌ ల్యాబ్‌ను త్వరలో ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మరో పది పాఠశాలల్లో రోబోటిక్‌ ల్యాబ్‌లను, స్టెమ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైస్కూల్స్‌లోని రోబోటిక్‌ ల్యాబ్స్‌ సిద్దాంతానికి, ఆచరణకు మధ్య వారధిగా పనిచేస్తూ అనుభవాలుగా మారుస్తాయన్నారు. ఫలితంగా విద్యార్థులు రోబోలను డిజైన్‌ చేసేందుకు, నిర్మించేందుకు, కోడ్‌ చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. తద్వారా ప్రోగ్రామింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సి, ఇంజనీరింగ్‌లో అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. హై స్కూల్‌ స్థాయిలో ఈ ప్రయోగాలు అనేక కీలక ప్రయోజనాలను అందిస్తాయని తెలిపారు. రోబోటిక్‌ ల్యాబ్‌ వల్ల విద్యార్థులు వైఫల్యాలను విశ్లేషించడం, కోడ్‌లోని సమస్యలను పరిష్కరించడం, హార్డ్‌వేర్‌ను సర్దుబాటు చేయడం, సవాళ్ళను ఎదుర్కోవడానికి పునరావృతమయ్యే దశలవారీ విధానాన్ని అభివృద్ధి చేసుకోవడం వంటివి విద్యార్థులు నేర్చుకుంటారని తెలిపారు. భవిష్యత్తులో రోబోల ప్రాధాన్యత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపారు. అందువల్ల విద్యార్థులు హైస్కూల్‌ స్థాయి నుంచే ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీపై పట్టు సాధించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ లంకాయగారి నాగయ్య, ఎంఈఓ–1 కొండూరు రఘునాధ్‌రాజు, ఎంఈఓ–2 సుబ్బరాయుడు, హెచ్‌ఎం నాగమణి, సైన్స్‌ ఉపాధ్యాయుడు, రోబోటిక్‌ ల్యాబ్‌ ఇన్‌ఛార్జ్‌ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

నా భర్తను అప్పగించండి

మదనపల్లె టౌన్‌ : ‘నా ఐదోతనాన్ని కాపాడండి‘అంటూ బాధితురాలు రామిశెట్టి చంద్రకళ వేడుకుంది. బుధవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో మదనపల్లె పట్టణం, నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ విలేకరులతో మాట్లాడుతూ.. 2004లో అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లికి చెందిన రామిశెట్టి (బీడ) శ్రీరాములు కుమారుడు దేవరాజ్‌ తో బెంగళూరు యలహంక గుడిలో తనకు వివాహ మైంది. పెళ్లయిన నాలుగు రోజులకే భర్త దేవరాజ్‌, అత్త రెడ్డెమ్మ, మామ బీడ శ్రీరాములు అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించింది. వేధింపులతో తాను రోగగ్రస్తురాలిగా మారి ఆసుపత్రి పాలయ్యానని, తన డబ్బు, బంగారం తీసుకుని విష ప్రయోగంతో చంపేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బతికే ఉన్నా చనిపోయాడని తప్పుడు డెత్‌ సర్టిఫికెట్‌ తెప్పించి, తాను 2006లో పెట్టిన వరకట్న వేధింపుల కేసును మదనపల్లె టూటౌన్‌ పోలీసులు మూసి వేశారని తెలిపింది. తనను మోసం చేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న తన భర్త దేవరాజ్‌ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, పదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా పోలీసులు న్యాయం చేయలేదని కన్నీరు మున్నీరైంది. తన భర్త బతికే ఉన్నాడని, పోలీసులు తన ఐదోతనం తుడిచిపెట్టకుండా కాపాడాలని ప్రాధేయ పడింది.

Advertisement
 
Advertisement
Advertisement