● జిల్లా ఆస్పత్రిలో ఆగిన కంటి శస్త్రచికిత్సలు
● రోజూ వచ్చి వెనుతిరుగుతున్న వైనం
● పనుల నిర్వహణపై శ్రద్ధ చూపని
కూటమి నాయకులు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో రూ. 20.50 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి కాకపోవడంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది నవంబర్ 17న అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇతర పనులు కొంచెం ఆలస్యంగా చేసినా.. కంటి విభాగం మాత్రం మొదటి ప్రాధాన్యతగా మార్చి చివరి నాటికి పూర్తి చేసి తమకు అప్పగించాలని ఆస్పత్రి అధికారులు కోరారు. అంతకంటే ముందుగానే పూర్తి చేసి అప్పగిస్తామని అధికారులు, టీడీపీ నాయకులు చెప్పారు. కంటి విభాగం పనులు ఇప్పటికీ మందకొడిగా కొనసాగుతుండటంతో ఈ ఏడాది కంటి శస్త్రచికిత్స ఒక్కటి కూడా జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వేసవి కాలంలో 300కు పైగా కంటి ఆపరేషన్ల నిర్వహణ
వేసవి కాలంలో పేద వృద్ధులు కంటి ఆపరేషన్లు చేయించుకుంటారు. ప్రొద్దుటూరులో ప్రైవేట్ కంటి ఆస్పత్రులు అనేకం ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు ఆరోగ్యశ్రీ కింద కూడా శస్త్ర చికిత్సలు చేస్తారు. అయితే ఆపరేషన్లు చేయడానికి 20 నుంచి 30 రోజుల వరకు సమయం చెప్పడంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న పేదలు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఎక్కువ మంది జిల్లా ఆస్పత్రికి వస్తుంటారు. పైగా ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు బాగా చేస్తారనే భావనతో.. ఇక్కడికి రావడానికే ఎక్కువ శాతం మంది ఇష్టపడతారు. వేసవి కాలంలో ఏప్రిల్, మే నెలల్లో ప్రతి యేటా 300కు పైగా జిల్లా ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారు. అయితే వేసవి ముగుస్తున్నా ఇప్పటికి ఒక్క ఆపరేషన్ కూడా జరగలేదు. దూర ప్రాంతాల నుంచి ప్రతి రోజు ఆస్పత్రికి వచ్చి నిరాశగా వెనుతిరిగి వెళ్తున్నారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలోని కంటి విభాగంలో రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారే కానీ.. ఇంత వరకు శ్వాబ్ పరీక్ష నిర్వహించలేదు. వారానికి ఒక సారి చొప్పున రెండు వారాలు ఆపరేషన్ థియేటర్‌లో శ్వాబ్ టెస్ట్ చేయాల్సి ఉంది. ఆపరేషన్ థియేటర్‌లోని పరికరాలు, గాలిలో సూక్ష్మ జీవుల కాలుష్యాన్ని గుర్తించడం కోసం ఈ టెస్ట్ చేయడం తప్పనిసరి. ఈ పనులు పూర్తయ్యేదెన్నడో.. కంటి ఆపరేషన్లు ప్రారంభమయ్యేది ఎప్పుడోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రోగుల ఇబ్బందులకు బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.
చేతులెత్తేశారు..
నవంబర్‌లో పనులు ప్రారంభించినా.. మొదట్లో రెండు, మూడు నెలలు మందకొడిగా సాగాయి. తర్వాత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితోపాటు ఇతర టీడీపీ నాయకులు రెండు, మూడు సార్లు జిల్లా ఆస్పత్రిని సందర్శించి పనులు త్వరగా పూర్తి చేయాలని హడావుడి చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో పనులు మందకొడిగా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. శిలాఫలకాన్ని ప్రారంభించి ఏడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ఆస్పత్రిలోని 47 బ్లాకుల్లో మరమ్మతు పనులు చేపట్టారు. ఇందులో చిన్న పిల్లల వార్డు, బ్లడ్‌బ్యాంక్, మూడు ఆప రేషన్ థియేటర్లను ఆధునీకరించాల్సి ఉంది. 200 వరకు మరుగు దొడ్లు కూడా నిర్మించాలి. అలాగే గ్రౌండ్‌ఫ్లోర్‌లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కాన్ఫరెన్స్ హాల్, శానిటేషన్ వర్కర్ల గదులు, అంబులెన్స్ షెల్టర్ తదితర పనులను ఇంకా ప్రారంభించనే లేదు.
కంటి ఆపరేషన్లు ప్రారంభిస్తాం
కంటి విభాగం భవనాన్ని ఈ నెలాఖరు నాటికి కాంట్రాక్టర్ అప్పగిస్తామని చెప్పాడు. సాధ్యమైనంత తొందరగా స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా కంటి విభాగం భవనంలో రూఫ్ వర్క్, పెయింట్ పనులు జరుగుతున్నాయి. తొందరలోనే కంటి ఆపరేషన్లు ప్రారంభిస్తాం.
– డాక్టర్ ఆనంద్‌బాబు, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్


