వాల్మీకిపురం : పట్టణంలోని తరిగొండ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి వైన్‌షాప్‌లో చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. గుర్తు తెలియని దుండగులు స్థానిక తరిగొండ రోడ్డులో వైన్‌షాప్‌లోకి చొరబడ్డారు. దుకాణం పైకప్పు రేకులు తొలగించి, లోనికి ప్రవేశించి క్యాష్ కౌంటర్‌లోని రూ.76 వేల నగదు, మద్యం బాటిళ్లు చోరీ చేశారని క్యాషియర్ యుగంధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం షాప్ తెరిచేందుకు వెళ్లిన క్యాషియర్ యథావిధిగా షెట్టర్ తీసి లోనికి వెళ్లారు. అక్కడ క్యాష్ కౌంటర్ పెట్టెను పగలగొట్టడం గమనించి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రాఘవరెడ్డి, ఎస్‌ఐ తిప్పేస్వామి ఆధ్వర్యంలో క్లూస్ టీం సహాయంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల వేలిముద్రలను సేకరించారు.
పిచ్చి కుక్క వీరంగం
మదనపల్లె టౌన్ : బి.కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ కంబాలపల్లిలో మంగళవారం పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని రెఫర్ చేశారు. కుటుంబీకులు బాధితురాలిని మదనపల్లికి తరలించగా చికిత్స పొందుతోంది. గ్రామంలో ఊర, పిచ్చి కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.


