కడప కోటిరెడ్డి సర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో ప్రవేశ పెట్టనున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.ముత్యాలరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.గంగాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఒక ప్రకటన ద్వారా ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు కలసి ఆర్టీసీ పరిరక్షణ కోసం, ఉద్యోగుల హక్కుల సాధన కోసం చేపట్టిన పోరాటాలకు ఏపీఎస్‌ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు టి.ముత్యాలరావు మాట్లాడుతూ ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడం, డిపోలు ఖాళీ చేయించి ఆర్టీసీ విలువైన స్థలాలను లీజు పేరుతో ప్రవేటువారికి దారా దత్తం చేయడం వల్ల సంస్థ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.గంగాంజనేయులు మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిష్కరించాలని పేర్కొన్నారు.


