ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు సమీపంలో చిరుత సంచారం చేసిన అనవాళ్లు కనిపించలేదని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆర్టీపీపీలో ఫారెస్ట్, ఎస్పీఎఫ్, విజిలెన్స్, ఆర్టీపీపీ అధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా చిరుత సంచరించిందని స్థానికులు చెప్పిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్టీపీపీలో చిరుత పాదముద్రలు, గుర్తులు ఇతర ఆధారాలు లభించలేదన్నారు. ఆర్టీపీపీ పరిసరాలు అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణుల సంచారం సాధారణమన్నారు. వారానికి రెండు, మూడు సార్లు రాత్రి వేళల్లో బాణసంచా పేల్చడం ద్వారా అడవి జంతువులు ప్లాంట్ సమీపంలోకి రాకుండా చూడొచ్చన్నారు. రాత్రి షిఫ్టులలో విధులు నిర్వహించే వారు చీకటి ప్రాంతాల్లో ఒంటరిగా తిరగొద్దన్నారు. వ్యక్తిగత భద్రత కోసం లాఠీ, కర్రను వెంట ఉంచుకోవాలన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ హనుమన్న, ఎస్పీఎఫ్ ఏసీ క్రిష్ణయ్య, ఆర్‌ఐ రమేష్, విజిలెన్స్ సీఐ నారాయణయాదవ్ ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు.


