బంగారు హారం అపహరణ | - | Sakshi
Sakshi News home page

బంగారు హారం అపహరణ

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

ముద్దనూరు : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మెడలో ధరించిన బంగారు హారం మంగళవారం చోరీకి గురైంది. బాధిత మహిళ సమాచారం మేరకు.. ముద్దనూరుకు చెందిన ప్రమీళ అనే మహిళ కడపలో ముద్దనూరుకు చెందిన వారి వివాహానికి హాజరై తిరిగి మధ్యాహ్నం కడపలో బైపాస్‌ రైడస్‌ బస్సులో ఎక్కింది. ముద్దనూరులోని 4 రోడ్ల కూడలిలో బస్సు దిగి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లి గమనించగా తన మెడలో ధరించిన సుమారు 3 తులాల బంగారు హారం చోరీకి గురైనట్లు గుర్తించింది. కడప బస్టాండు నుంచే ఇద్దరు మహిళలు తన పక్కలోనే వున్నారని, వారిరువురు కూడా తనతోపాటు బస్సులో ఎక్కి, వారు కూడా ముద్దనూరులోనే దిగి వెళ్లిపోవడం తాను చూశానని ఆమె తెలిపారు. బస్సులో ప్రయాణించే సమయంలోనే వారు హారం కాజేసి వుంటారని ఆమె పేర్కొన్నారు.

వృద్ధుడి ఆత్మహత్య

మైదుకూరు : మున్సిపాలిటీలోని గడ్డంవారిపల్లె వద్ద ఉన్న ఇండస్ట్రీయల్‌ సముదాయంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న చల్ల ఆంజనేయులు(70) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆంజనేయులు నిత్యం మద్యం సేవిస్తుండటంతో ఆరోగ్యం క్షీణించింది. తాను బతకనని భార్య సావిత్రి, కొడుకు లక్ష్మీనారాయణతో చెప్పేవాడు. శుక్రవారం ఓ వేరుశనగ ఆయిల్‌మిల్లు సమీపంలో విషద్రావణం సేవించగా అక్కడున్న వారు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలిస్తుండగా మృతి చెందాడు. కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం

కడప అర్బన్‌ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)లో ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి(40) చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో ఉదయం 5 గంటలకు మృతి చెందారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచామని, ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్‌ అధికారులు తెలిపారు.

గాయపడిన వ్యక్తి మృతి

జమ్మలమడుగు : పట్టణంలోని ధనలక్ష్మీ సినిమా హాల్‌ వీధికి చెందిన కాకరవాద దస్తగిరి(53) అనే వ్యక్తిని సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పెన్నానదిలో పడిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో దారిన పోతున్న కొంత మంది వ్యక్తులు 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది దస్తగిరిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యులు చికిత్స చేశారు. అయితే మంగళవారం తెల్లవారుజామున గౌస్‌పీర్‌ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్బన్‌ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

పేకాట స్థావరంపై

పోలీసుల దాడి

చక్రాయపేట : మండలంలోని ఎర్రబొమ్మనపల్లె గ్రామ సమీపంలో మంగళవారం పేకాట స్థావరంపై దాడులు జరిపి 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు. నాగరాజునాయక్‌, అనిల్‌ కుమార్‌, వెంకట రామిరెడ్డి, అమర, నాగిరెడ్డితోపాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. వారి నుంచి రూ.52,340లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా పోలీసులు తెలుగు తమ్ముళ్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దొరికిన మొత్తం కూడా భారీ స్థాయిలో ఉన్నట్లు ఆ ప్రాంతీయులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement