వ్యక్తి ప్రాణాలను కాపాడిన డయల్‌ 112 కాల్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ప్రాణాలను కాపాడిన డయల్‌ 112 కాల్‌

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : కడప తాలూకా ఎస్‌ఐ మహమ్మద్‌ రఫి వేగవంతమైన స్పందన, తక్షణమే రంగంలోకి దిగిన ఇద్దరు బ్లూకోట్‌ పోలీసుల సమయ స్ఫూర్తితో.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడారు. డయల్‌ 112కు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి కేవలం 10 నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాలనుకున్న వ్యక్తిని సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చి శభాష్‌ పోలీసు అని ప్రజల మన్నననలు పొందారు. పోలీసు వివరాల మేరకు.. కడప నగరం ప్రకాష్‌నగర్‌ పరిధిలో ఓ వ్యక్తి చికెన్‌ సెంటర్‌ను నడుతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అప్పుల బాధ తాళలేక జీవితంపై విరక్తితో ఆత్యహత్య చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరాడు. ఆందోళనకు గురైన ఇంటిలోని కుటుంబ సభ్యులు డయల్‌ 112కు సమాచారం ఇవ్వడంతో వెంటనే కమాండ్‌ కంట్రోల్‌ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ పురుషోత్తం రాజు ఆదేశాల మేరకు కమాండ్‌ కంట్రోల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మూర్తి, కడప తాలూకా ఎస్‌ఐ మహమ్మద్‌రఫితోపాటు బ్లూకోట్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తాలూకా ఎస్‌ఐ మహమ్మద్‌ రఫి బాధితున్ని గుర్తించే క్రమంలో ట్రాక్‌ వెంబడి జల్లెడ పడుతూ వెళుతుండగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే వ్యక్తి లొకేషన్‌ను గుర్తించి కడప రైల్వే స్టేషన్‌ నుంచి తిరుపతికి వెళ్లే రైలు మార్గంలో పుట్లంపల్లి సమీపంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. ట్రాక్‌ వెంబడి గాలిస్తూ ట్రాక్‌పై ఉన్న బాధిత వ్యక్తిని తక్షణమే ట్రాక్‌ నుంచి తప్పించి సురక్షితం చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ చేసి వారికి అప్పగించారు. కడప తాలూకా ఎస్‌ఐ మహమ్మద్‌ రఫి, బ్లూకోట్‌ సిబ్బంది, హెడ్‌కానిస్టేబుల్‌ నజీర్‌, కానిస్టేబుల్‌ రంగనాథ్‌లను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement