సుండుపల్లె : జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు అయ్యాయి. సుండుపల్లె మండల పరిధిలోని బూడిదేటిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుణా ల వేడుకల రద్దీ వల్ల ఒకే బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తుండగా వాహనం అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో పీలేరుకు చెందిన మల్లిఖార్జునకు కాలు విరగ్గా, సుండుపల్లెకు చెందిన ఆసీఫ్, బాబ్జాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ద్విచక్ర వాహనం – కారు ఢీ
కలసపాడు : మండలంలోని పెండ్లిమర్రి వద్ద ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. మండలంలోని పుల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన గుడిమెరామ్మోహన్ ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. తన ద్విచక్ర వాహనంలో ఓ పని నిమిత్తం పోరుమామిళ్ళకు బయలుదేరాడు. పెండ్లిమర్రి వద్ద కలసపాడు నుండి పోరుమామిళ్లకు వెళుతున్న ఓ డ్రైవింగ్ స్కూల్ వాహనం రోడ్డుపై ఓ మహిళను తప్పించబోయి ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న రామ్మోహన్ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రామ్మోహన్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు.


