ప్రొద్దుటూరు క్రైం : బిల్లులు లేకుండా బంగారు నగలను విక్రయించరాదని ప్రొద్దుటూరు బంగారు దుకాణ యజమానులకు ఏఎస్పీ విభూకృష్ణ సూచించారు. పట్టణంలోని బంగారు వ్యాపారులు, అసోసియేషన్ ప్రతినిధులతో మంగళవారం ఏఎస్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి దుకాణ యజమాని నాణ్యమైన సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. మెయిన్‌బజార్, దర్గాబజార్, పాతమార్కెట్ సమీపంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా దుకాణదారులు సహకరించాలన్నారు. రహదారికి ఇరువైపులా దుకాణాల ముందు ఒక లైన్‌ను ఏర్పాటు చేసుకొని లైన్ లోపలే బైక్‌లు నిలుపుకొనేలా ఎవరికి వారు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. బంగారు నగలను విక్రయించడానికి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దొంగ బంగారు కొనుగోలు చేసి ఎవరూ ఇబ్బందులు పడరాదని సూచించారు. బిల్లులు లేకుండా బంగారు విక్రయించరాదని, తగు ఆధారాలతో బంగారు నగలను విక్రయించడం శ్రేయష్కరమన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు బుశెట్టి రామ్మోహన్‌రావు, ఉప్పలూరు ఇలియాస్, సీఐలు టీవీ కొండారెడ్డి, వంశీనాథ్, ట్రాఫిక్ సీఐ సురేష్‌రెడ్డి, ఎస్‌ఐలు శ్రీనివాసులు, రాఘవేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


