టీడీీపీ వర్సెస్ జనసేన!
● తెరపైకి డిప్యూటీ సీఎం పేరెంట్స్
మీటింగ్ బిల్లుల వివాదం
● స్వయంగా ట్వీట్ చేసిన
జోనల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి
● పొత్తు ధర్మం ఏనాడైనా పాటించారా? నిలదీస్తున్న జనసేన నాయకులు
సాక్షి ప్రతినిధి, కడప: కూటమి ముంగిట కుంపట్లు రాజుకున్నాయి. టీడీపీ జోనల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసుల రెడ్డి రాజ్యసభ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారి టీడీపీ, జనసేన మధ్య ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతేడాది కడపలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగు బిల్లులే ఇప్పుడు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఆ సమావేశానికి అయిన ఖర్చులు ఎక్కడా? అంటూ నేరుగా పవన్ కళ్యాణ్‌ను టీడీపీ నేతలు ప్రశ్నిస్తుంటే.. అసలు శ్రీనివాసులురెడ్డి ఏనాడైనా పొత్తు ధర్మం పాటించారా?అంటూ జనసైనికులు ఎదురుదాడికి దిగుతున్నారు.
పవన్‌ను ప్రశ్నించిన వాసు
కడప నగరంలోని మున్సిపల్ హైస్కూళ్లో 2024 డిసెంబర్ 7వ తేదీన పవన్‌కల్యాణ్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులో పాల్గొన్నారు. ఆ బిల్లులు ఎక్కడా అని శ్రీనివాసులురెడ్డి నేరుగా ఎక్స్ ఖాతాలో పవన్ కల్యాణ్నే ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనసేన శ్రేణులు దాంతో మాకేం సంబంధం అంటూ, అసలు మీరు కడప జనసేన వారికి చేసిందేమీటంటూ ప్రశ్నిస్తున్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్‌తో పాటు పలువురు నేతలు పొత్తు ధర్మం విస్మరించడంపై ధ్వజమెత్తారు.
బిల్లుల స్వాహాకు యత్నించారని ఎదురుదాడి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కోసం ఏర్పాట్ల ఖర్చు విషయంలోనూ టీడీపీ నేతలు అక్రమాలకు తెరలేపారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి టీడీపీ నేతలు ఎందుకు ఖర్చులు పెట్టాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు. అవే బిల్లులు రాబట్టుకునేందుకు టీడీపీ నేతలు ఆర్‌అండ్‌బీలో బిల్లులు పెట్టారు. దాదాపు 20 లక్షలు చెల్లించాలని కోరారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, అదే బిల్లులను కడప కార్పొరేషన్లోనూ ఎందుకు పెట్టారని జనసేన నేతలు నిలదీస్తున్నారు. ఈ ఏడాది మార్చి 10న నిర్వహించిన కడప కార్పొరేషన్ పాలకవర్గ సమావేశంలో టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ సభ ఖర్చుల చిట్టాను ఉంచారు. పాలకవర్గం అంతా పరిశీలించి, తమకు సంబంధం లేని అంశం అంటూ ఆ బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. ఇదే విషయాన్ని జనసేన నేతలు దెప్పి పొడుస్తున్నారు.
అక్రమాలకు నిలయంగా నాటి హడావుడి
డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌తో ఎలాంటి ప్రయోజనం లేకపోగా, నాటి హడావుడి ఇప్పుడు కూటమిలో చోటుచేసుకున్న అక్రమాలను బహిర్గత పర్చింది. సాక్షాత్తు పవన్ కల్యాణ్ కోసం చేసిన ఏర్పాట్ల బిల్లులనే ప్రభుత్వం ఇవ్వడం లేదనేది ఒక ఎత్తైతే...అసలు ఒకే బిల్లును రెండు శాఖల్లో వసూలు చేసుకునేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు డిప్యూటీ సీఎంను సైతం రోడ్డుమీదకు తెస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.


