ఇంధన ధరల పెంపుపై నిరసన | - | Sakshi
Sakshi News home page

ఇంధన ధరల పెంపుపై నిరసన

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ట్రంప్‌ విధిస్తున్న సుంకాలను వ్యతిరేకించకుండా మోదీ ప్రభుత్వం అమెరికా కాళ్ల వద్ద సాగిలపడిందని విమర్శించారు. చౌకగా వస్తున్న రష్యా ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేజీ బేసిన్‌లోని గ్యాస్‌ నిక్షేపాల్లో 50 శాతం రాష్ట్ర వాటాను కేంద్రం నుంచి తీసుకు రాలేకపోయిందని ధ్వజమెత్తారు. సీపీఐ నాయకుడు నాగసుబ్బారెడ్డి, వేణుగోపాల్‌, కేసీ బాదుల్లా, వెంకట శివ, మద్దిలేటి, సీపీఎం నాయకుడు రామ్మోహన్‌రెడ్డి, దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ

– జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం

కడప సెవెన్‌రోడ్స్‌ : వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరిచే కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం ఆదేశించారు. మంగళవారం కడప జెడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. పారిశుధ్యం, స్వచ్ఛరథం కార్యక్రమాలకు సంబంధించి ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ వస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు చేపట్టాలన్నారు. పన్నుల వసూళ్లపై ఇప్పటి నుంచే దృష్టి సారించి లక్ష్యసాధనకు కృషి చేయాలని ఆదేశించారు.

బాధితులకు ఆశ్రయం

కడప సెవెన్‌రోడ్స్‌ : సోమశిల వెనుక జలాల్లో చేపల వేటకు వెళ్లి దళారుల వలలో చిక్కుకున్న 11 మంది బాధితులకు అధికారులు విముక్తి కలిగించారు. అనంతరం వారిని కడప నగరంలోని ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహానికి చేర్చారు. వీరిలో ఏపీకి చెందిన వారే కాకుండా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీరిని స్వగ్రామాలకు పంపించే వరకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. వీరికి రక్షణగా నందలూరు పోలీసులను ఏర్పాటు చేశా రు. కాగా వీరిని కొందరు దళారులు చేపల వేటకోసమంటూ మభ్యపెట్టి ఇక్కడికి రప్పించుకుని సరైన జీతభత్యాలు ఇవ్వకుండా.. ఇళ్లకు పోనియకుండా వేధిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్‌, రాజంపేట సబ్‌ కలెక్టర్‌, ఏఎస్పీ సూచనల మేరకు వీరికి ఆ శ్రయం కల్పించామని ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

యోగాతో ఆరోగ్య భాగ్యం

కడప సెవెన్‌రోడ్స్‌ : యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుందని కలెక్టర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్‌–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కేంద్రమైన కడపలోని వైఎస్‌ రాజారెడ్డిక్రికెట్‌ స్టేడియంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరిగే ఫ్యామిలీ యోగా కార్యక్రమం ఉంటుందని, ఇందులో ప్రతి కుటుంబం ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ యోగాంధ్ర.ఏపీ.జీఓవీ.ఇన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement