కడప సెవెన్‌రోడ్స్ : కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమం విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కడప సెక్రటేరియేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోమ్మల వరప్రసాద్ అన్నారు. కర్నూలులో ఈనెల 6వ తేదిన మృతి చెందిన వీఆర్వో మహమ్మద్ హుసేన్‌కు నివాళులర్పిస్తూ మంగళవారం సాయంత్రం కడప సచివాలయ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. మృతికి సంతాపంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కడప సెక్రటేరియేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పోమ్మల వరప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు సెక్రటరీలకు పూర్తి స్థాయిలో పదోన్నతి ఇవ్వలేదన్నారు. ఐదు నెలలుగా మున్సిపల్ పన్నుల వసూళ్లు, వివిధ రకాల సర్వేలు, జనాభా లెక్కల సేకరణ, సిటిజన్ ఈకేవైసీ, కౌసలం సర్వే, బీఎల్‌ఓ డ్యూటీలు తమతో చేయిస్తున్నారని వివరించారు. దీంతో పండుగలు, పబ్బాలు అంటూ ఏమి లేకుండా కుటుంబాలతో గడిపే అవకాశాన్ని కోల్పొతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణ గ్రామ ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి నాగార్జున, శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


