ప్రైవేట్‌ పాఠశాలలపై పన్నుల భారం తగదు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ పాఠశాలలపై పన్నుల భారం తగదు

Jun 9 2026 5:48 AM | Updated on Jun 9 2026 5:48 AM

కడప ఎడ్యుకేషన్‌ : ఎప్పుడూ లేని విధంగా ప్రొఫెషన్‌ టాక్స్‌ పేరుతో చిన్నా చితక బడ్జెట్‌ స్కూల్స్‌కు కూడా నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని, ఇది చాలా అన్యాయమని కృస్మా జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి అన్నారు. చిన్న పాఠశాలలు నెలనెలా జీతాలు ఇవ్వడమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు టీచర్ల నుంచి ప్రొఫెషన్‌ టాక్స్‌ కట్టించాలి అని చెప్పడం ఎంత వరకు న్యాయం అన్నారు. ఈ విషయమై కమర్షియల్‌ టాక్స్‌ శాఖ జారీ చేసిన ప్రొఫెషన్‌ ట్యాక్స్‌ నోటీసులపై సోమవారం కమర్షియల్‌ టాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ కేథారేశ్వరావును ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్స్‌తో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లెక్కల జోగిరామిరెడ్డి మాట్లాడుతూ చిన్న జీతాలతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండే పరిస్థితుల్లో ఇటువంటి టాక్స్‌ కట్టాలని చెప్పడం వల్ల ప్రైవేట్‌ టీచర్లు ఆ వృత్తి మానుకొని దినసరి కూలీలుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని అధిక శాతం ప్రైవేట్‌ పాఠశాలలు తక్కువ ఫీజులతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల జీతాలు, విద్యుత్‌ చార్జీలు, భవన అద్దెలు, నిర్వహణ ఖర్చులు, ఇతర వ్యయాలు గణనీయంగా పెరగడంతో పాఠశాలలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రొఫెషన్‌ ట్యాక్స్‌ భారం తక్కువ బడ్జెట్‌ పాఠశాలలపై మరింత ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఇటువంటి పాఠశాలలకు మినహాయింపు లేదా ప్రత్యేక రాయితీలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమాజానికి సేవ చేస్తున్న తక్కువ బడ్జెట్‌ విద్యాసంస్థల పరిస్థితిని ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులను కలసి సమస్యలపై చర్చిస్తామన్నారు. తాము పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలలకు చెందిన పలువురు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement