లింగాల : లింగాల మండలం గుణకణపల్లె గ్రామ అరటి రైతులు సోమవారం కడప కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగాలలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అధికారులపై ఫిర్యాదు చేశారు. గతేడాది మే నెలలో వీచిన ఈదురు గాలులకు గుణకణపల్లెలో భారీగా అరటిపంట నేలకొరిగిందన్నారు. అప్పట్లో ఉద్యాన శాఖ అధికారులు నివేదికలు తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు అందజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని కూడా మంజూరు చేసిందన్నారు. గతంలో ఏపీజీబీ బ్యాంక్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఐఎస్‌ఎఫ్‌సీ కోడ్ మారడంతో.. ఆ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారికి ఇప్పటికీ నష్టపరిహారం అందలేదన్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించగా తాము రైతుల అకౌంట్ నంబర్లు, బ్యాంకు ఐఎస్‌ఎఫ్‌సీ కోడ్ నంబరు ఇచ్చామన్నారు. నష్టపరిహారం డబ్బులు కూడా అందులో పడ్డాయని, బ్యాంక్ అధికారుల తప్పిదంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. పలుమార్లు బ్యాంక్ చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదన్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని గ్రీవెన్స్ సెల్ అధికారి రైతులకు హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో మునేశ్వర్‌రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, బెస్త రాజశేఖర్ తదితరులు ఉన్నారు.


