ఎర్రగుంట్ల : మండల పరిధిలోని వై.కోడూరు గ్రామానికి చెందిన యాపరాల చిన్న నాగిరెడ్డి(83) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. ఈ నెల 1న నాలుగు రోడ్ల కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటోను ఢీకొన్న కారు
బాలుడికి తీవ్ర గాయాలు
మైదుకూరు : విహార యాత్రకు వెళుతున్న ఆ కుటుంబానికి విషాదం ఎదురైంది. ప్రొద్దుటూరుకు చెందిన దాదాపీర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో సొంత ఆటోలో నెల్లూరు జిల్లా కలువాయికి విహార యాత్రకు బయల్దేరారు. అక్కడ అందమైన ప్రకృతి, జలపాతాలు చూసేందుకు ఎంతో ఉత్సాహంతో వెళుతుండగా బళ్లారి – కృష్ణపట్నం హైవే బైపాస్‌పై మున్సిపాలిటీలోని సరస్వతి పేట వద్ద ఆటోను కారు ఢీకొన్నది. ఈ సంఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా షామీర్ అనే 13 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు.


