● యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న పచ్చ నేతలు
● ఆగస్టు 15వరకు ఇసుక తరలించవద్దన్న కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
● పాపాఘ్ని, పెన్నా నదులను గుళ్ల చేస్తున్న వైనం
● కన్నెత్తి చూడని పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులు
సాక్షి ప్రతినిధి, కడప : ‘నదీగర్భాల్లో ఇసుక రవాణా ఆగస్టు 15వరకూ నిషేధిస్తున్నాం.. ఇదివరకూ డంప్ చేసిన యార్డుల ద్వారా ఇసుక తీసుకెళ్లాలి.. ’ఈ నెల 6వ తేదీ శనివారం జరిగిన జిల్లా సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలు ఇవి. పచ్చ నేతలకు ఈ మాటలు చెవికెక్కలేదో.. అధికార టీడీపీ నేతలకు కలెక్టర్ మినహాయింపు ఇచ్చారో గానీ.. ఇసుక అక్రమ రవాణా ఎక్కడా ఆగడం లేదు. పట్టుమని 24 గంటలు కూడా ఇసుక తవ్వకుండా ఉండలేకపోయారు. ఇక మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు సైతం కలెక్టర్ ఆదేశాలను అమలు చేయలేకపోయారు. ఫలితంగా పెన్నా, పాపాఘ్ని నదులు గుల్లవుతున్నాయి. అధికార నేతల దోపిడీ పర్వానికి విలవిల్లాడుతున్నాయి. ఒళ్లంతా గుంతలు తేలి..తడారి ఎడారిగా దర్శనమిస్తున్నాయి.
సీఎం చంద్రబాబు సర్కార్‌లో ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులకు ఇసుక అక్రమ ఆదాయ వనరుగా మారింది. ఉచిత ఇసుక మాటున నదులు లూఠీ చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పాపాఘ్ని, పెన్నా, చిత్రావతి, చెయ్యేరు నదులను తెలుగుతమ్ముళ్లు చెరబట్టారు. పేరుకే ప్రభుత్వ రీచ్‌లు, ఆయా రీచ్‌ల నుంచి అనధికారికంగా నిత్యం వేలాది టన్నులు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. కమలాపురం, కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డే లేకుండా పోయింది. అక్రమ సంపాదన కోసం పోటీ పడుతోన్నారు. ప్రభుత్వ రీచ్‌లు దక్కించుకుని పొరుగున్నే ఉన్న మరో గ్రామం నుంచి ఇసుక బాహాటంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పైడికాల్వ, కొత్తగంగిరెడ్డిపల్లె, నందిమండలం, కొండూరు, సంబటూరు ఇసుక రీచ్‌లు నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఇసుక రీచ్ నిర్వహణను దక్కించుకున్న తెలుగుతమ్ముళ్లు ఆ మాటునా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇదే తంతు కొండాపురం, సిద్దవటం ప్రాంతాల్లో కూడా తెరపైకి వస్తోంది. అధికారిక రీచ్‌లను అడ్డుపెట్టుకొని అనధికారిక రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని పలువురు వాపోతున్నారు.
అక్రమ రవాణాకు అడ్డుకట్టేదీ?
వర్షాభావ దుస్థితి, రాబోవు రోజుల్లో తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ శ్రీధర్ ఆగస్టు 15 వరకూ ఇసుకను నదీ గర్భాలల్లో తరలించవద్దని ఆదేశించారు. ఆమేరకు సాండ్ కమిటీ సమావేశంలో జిల్లా యంత్రాంగానికి స్పష్టం చేశారు. అయినప్పటికీ పాపాఘ్నిలో ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడలేదు. మారెళ్లమడక, సోగలపల్లె, నందిమండలం, యర్రబల్లె, పైడికాల్వ, సంబటూరు ప్రాంతాల నుంచి, పెన్నా నదిలో కొండాపురం, సిద్ధవటం ప్రాంతాల నుంచి యధేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ రీచ్‌లతో నిమిత్తం లేకుండా అనధికార రీచ్‌ల నుంచి కూడా తెలుగుతమ్ముళ్లు యధేచ్ఛగా అక్రమంగా తరలించకు వెళ్తున్నారు. యంత్రాలతో లోడింగ్ చేసి, భారీ టిప్పర్లతో ఇసుక కన్పించకుండా పట్ట కట్టుకొని బెంగుళూరు పట్టణానికి తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నదుల్లో అధికారిక రీచ్‌లల్లో ఇసుక అలాగే కొనసాగిస్తూ ఆ మాటున పొరుగు గ్రామాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఘటన కమలాపురం నియోజకవర్గంలో యధేచ్ఛగా కొనసాగుతోంది. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికై నా అక్రమార్కుల నుంచి నదులను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.


