విత్తన ఎంపికే కీలకం | - | Sakshi
Sakshi News home page

విత్తన ఎంపికే కీలకం

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

పాటించాల్సిన జాగ్రత్తలు

బిల్లులు తీసుకోవాలి

నాణ్యమైన విత్తనాలతోనే

అధిక దిగుబడులు

చీడపీడలకు చెక్‌

ఖరీఫ్‌లో 79,773 హెక్టార్లలో సాగు

కడప అగ్రికల్చర్‌: పంటలసాగులో విత్తన ఎంపిక అత్యంత కీలకం. ఇది పంటల దశ, దిశ మార్చడంతోపాటు మంచి దిగుబడులకు దోహదం చేస్తోంది. అలాగే మంచి విత్తన ఎంపికతో చీడపీడలను తట్టుకుని నాణ్యమైన దిగుబడిని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కావున రైతులు విత్తన ఎంపిక, కొనుగోలులో నిర్లక్ష్యం చేయకుండా..వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను పాటించాల్సి అవసరం ఉంది. ఎందుకంటే విత్తన ఎంపికలో ఏదైనా పొరపాటు జరిగితే పంట సాగు మొదులుకుని దిగుబడి వరకు.. పెట్టిన పెట్టుబడి ఖర్చు, రైతుల కష్టం నేలపాలు అవుతుంది.అందువల్ల పంటల సాగుచేసే ముందు విత్తన ఎంపిక తదితర విషయాల్లో రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలను పాటించాల్సి అవసరం ఉంది.

ప్రారంభమైన ఖరీప్‌ సీజన్‌...

రాష్ట్రానికి మరో వారం రోజుల్లో రుతుపవనాల రానున్నాయి. రుతుపవనాలతో సంబంధం లేకుండా ఇప్పటికే జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో రైతులు కూడా కాడి, మేడి సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దుక్కులు ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 79,773 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకానున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీతో మంజూరు చేసింది. దీంతోపాటు నదీ పరివాహక ప్రాంతాలైన సిద్దవటం, చెన్నూరు. కమలాపురం, చాపాడు తదితర మండలాల పరిధిలో నీటి వసతి ఉన్న వారు వరినారు సాగుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. దీంతోపాటు వర్షాధారిత ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వేరుశనగ సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ఎక్కడపడితే అక్కడ వరి, వేరుశనగ, జొన్నలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న వంటి విత్తనాలను కొనుగోలు చేస్తుంటారు.అయితే వ్యవసాయ అధికారుల సర్టిఫైడ్‌ చేసిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే షాపు యజమాని లైసెన్సు ఉందా లేదా అని తెలుసుకోవాలి. దీంతోపాటు కొనుగోలు చేసిన విత్తనాలకు బిల్లులు కూడా అడిగి తీసుకోవాలి. తీసుకున్న విత్తన బిల్లులను పంట దిగుబడి చేతికి వచ్చే వరకు భద్రంగా దాచుకోవాలి. లేకుంటే విత్తన ఎంపికలో ఏదైనా పొరపాటు జరిగితే దిగుబడులు తగ్గి రైతన్నలు నష్టపోయే ప్రమాదం ఉంది. వరితోపాటు ఇతర విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. విత్తనమే దిగుబడులను నిర్ణయిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పంటపేరు సాగు (హెక్టార్లలో)

వరి 33078

కంది 5992

మొక్కజొన్న 1495

మినుము 3745

వేరుశనగ 4446

ఉల్లి 5203

సోయాబీన్‌ 1074

సన్‌ఫ్లవర్‌ 837

సజ్జ 994

కొర్ర 569

జొన్న 428

వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన అధీకృత డీలర్ల నుంచే విత్తనాలను కొనుగోలు చేయాలి.

విత్తనాలను కొనుగోలు సమయంలో డీలర్ల వద్ద తీసుకున్న బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలి

బిల్లుపై విక్రయదారుడి పేరు, రాష్ట్ర అమ్మకపు పన్ను నంబర్‌, విత్తనరకం, గడువుతేదీ, కంపెనీ పేరు, డీలర్‌ సంతకం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

ఎక్కడ కూడా లూజు విత్తనాలు, గడువు దాటినవి ఎటువంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు.

విత్తనాల సంచిపైన సీల్‌ ఉందా, లేదా అని చెక్‌ చేసుకోవాలి.

రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు విక్రయదారులు ఇచ్చే కరపత్రాలను తీసుకుని వాటిలో పేర్కొన్న అంశాలు పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలి.

విత్తనం కొనుగోలు చేసిన వెంటనే పరీక్షించాలి. మొలకశాతం సంతృప్తిగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి.

మొలకెత్తే సమయం, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.

ప్రభుత్వం ధ్రువీకరించిన సంస్థల్లో..

రైతులు విత్తనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ధ్రువీకరించిన సంస్థలు, ఏఆర్‌ఎస్‌ సెంటర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అక్కడ వీలుకాకపోతే లైసెన్సు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన విత్తనాల్లో మొలకశాతం చెక్‌ చేసుకోవాలి.మొలక శాతం బాగుంటేనే విత్తనాలను కొనుగోలు చేసుకోవాలి.

– ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త,

వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఊటుకూరు, కడప

డీలర్లు వద్ద విత్తనాలు కొనుగోలు చేసే రైతులు డీలర్లను అడిగి బిల్లులు తీసుకోవాలి. పంట దిగుబడి వచ్చే వరకు వీటిని భద్రంగా దాచుకోవాలి. పంటలో పూత పిందె, దిగుబడిలో తేడా వస్తే స్థానిక వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.

– మట్టా. సుబ్రమణేశ్వరావు,

జిల్లా వ్యవసాయ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement