డాక్టర్, ఇంజినీర్, సైంటిస్ట్, లాయర్, ఛార్టెర్డ్ అకౌంటెంట్, టీచర్, టెక్నీషియన్, సివిల్ సర్వెంట్, గ్రూప్ అధికారి.. ఇలా మీ లక్ష్యం ఏదైనప్పటికీ.. వాటిని చేరుకోవడానికి ఇంటర్మీడియట్ వారధిగా నిలుస్తుంది. ఏ వృత్తిలోకి వెళ్లాలన్నా కూడలి లాంటిది ఇంటర్. అందుకే భవిష్యత్తు లక్ష్యాలను చేరుకునేందుకు ఇంటర్‌ను బాగా చదువుకోవాలి. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తరగతులు శనివారం ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో అందిస్తున్న కథనం.
రాజంపేట టౌన్ : ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులది కౌమార దశ. ఈ దశలో ఉండే వారి ఆలోచనలు, ఉరకలేసే ఉత్సాహం ఇలా అన్నీ కూడా రాకెట్ కంటే వేగంగానే ఉంటాయి. అలాగే ఎన్నో కలలు, ఆశలు, ఆనందాలు, చిన్నపాటి విషయాలకే హర్ట్ అయ్యే సందర్భాలు, చదువుకోవడాలు, కాలేజీకి డుమ్మా కొట్టడాలు ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ నుంచే ప్రారంభం అవుతాయి. ఎందుకంటే టెన్త్ వరకు తల్లిదండ్రుల చాటున పెరిగిన విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లోకి ప్రవేశించగానే స్వేచ్ఛ రెక్కలు తొడుగుతుంది. అందువల్ల ఇంటర్మీడియట్‌లో చేరిన ప్రతి విద్యార్థిలో అదేదో తెలియని అనుభూతి ఉంటుంది. అదే సమయంలో కొత్త పరిసరాలు, కొత్త పరిచయాలు, సరికొత్త ఆలోచనలు ఇలా అన్నీ కూడా విద్యార్థులకు కొత్తగాను, వింతగాను అనిపిస్తాయి. టీనేజీలో ఉన్న వారందరికీ అన్నీ తెలిసినట్లే ఉంటాయి. కాని ఏమి తెలియని తనం ఆవహిస్తుంది. విద్యార్థులు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటే జీవితం విజయం వైపు పయనిస్తుంది.. కొత్త బంగారులోకం అవుతుంది. ఏమాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకున్నా జీవితం సరిదిద్దుకోలేనంతగా వెనక్కి వెళుతుంది. పరాజయం బాటలో నడుస్తుంది. తొలిసారి పబ్లిక్ పరీక్షల్లో విజయం సాధించామన్న ఆత్మవిశ్వాసం, పాఠశాలను దాటి కళాశాలలో చేరామన్న ఉత్సాహం, కొత్త పరిచయాలు, కళాశాల వాతావరణం కలిగించే ఆనందం వెరసి విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ కొత్త అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి. అనువైన గ్రూపు, ఇష్టమైన పాఠ్యాంశాలు చదివే తొలి స్వేచ్ఛా దశ ఇంటర్మీడియట్‌లోనే ఉంటుంది. జీవితంలో కీలక అడుగులన్ని ఇంటర్మీడియట్‌లోనే పడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలు సాధించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినా, గాడి తప్పి అంధఃపాళానికి పడిపోయినా ఇంటర్మీడియట్‌లోనే బీజం పడుతుంది. హైస్కూల్ విద్యతోనే ప్రారంభమయ్యే కౌమార ప్రాయం ఇంటర్మీడియట్‌లో మరింత పురి విప్పుతుంది. అందువల్ల ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ ఎంతో ప్రధానమైనదని విద్యావేత్తలు చెబుతున్నారు.
చదువుపైనే దృష్టి సారించాలి
ఇంటర్మీడియట్ విద్యార్థులు టీనేజీలో ఉంటారు. అందువల్ల వారి ఆలోనలు చాలా భిన్నంగా ఉంటాయి. కొన్నింటి పట్ల వెంటనే ఆకర్షితులవుతారు. అయితే మనసు అదుపులో ఉంచుకొని తొలి ప్రాధాన్యత చదువుకే ఇవ్వాలి. మనసును అందుపులో ఉంచుకోకుంటే జీవితం అల్లరి పాలయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. సినిమాల్లో చూపించేల్లా కాలేజీకి డుమ్మా కొట్టడం హీరోయిజం కాదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులు ఇచ్చే నోట్స్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం, పోటీ పరీక్షలకు అనువుగా ప్రణాళికలను రూపొందించుకోవడం, స్నేహితులతో కలిసి చదువుకోవడం వంటివి ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయి.
స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యం
ప్రధానంగా ఇంటర్మీడియట్‌లో స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యమైనది. ఇంటర్‌లో ఏర్పడే స్నేహాలు విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశిస్తాయి. టెన్త్ వరకు తల్లిదండ్రుల పెంపకం వల్ల చాలా మంది విద్యార్థులు సన్మార్గం వైపే పయనిస్తారు. అయితే ఇంటర్ దశలో స్నేహాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల స్నేహాల గురించి తెలుసుకోవాలి. తమ పిల్లలు సరైన వారితో స్నేహం చేయకుంటే ఆ విషయాన్ని సున్నితంగా చెప్పి తమ దారిలోకి తెచ్చుకోవాలి. తల్లిదండ్రులు ఎవరితో అయినా స్నేహం చేయవద్దు అంటే.. పిల్లలు కూడా చెడ్డవారితో స్నేహానికి దూరంగా ఉండాలి. మంచివారితో స్నేహం మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. చెడ్డవారితో స్నేహం ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడేందుకు అడ్డుపడుతుంది.
మొదలైన ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు
గాడి తప్పితే జీవితమే గందరగోళం
క్రమశిక్షణ అలవరుచుకుంటే
ఉజ్వల భవిష్యత్తు


