● ఆల్విన్ డ్రైవర్ దుర్మరణం
బద్వేలు అర్బన్ : బద్వేలు – మైదుకూరు రహదారిలోని చెన్నంపల్లె వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఓ లారీని ఆల్విన్ వెనుకవైపు నుంచి ఢీకొనడంతో ఆల్విన్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా మార్టూరు మండలం చిమ్మిరిబండ గ్రామానికి చెందిన కట్టా వాసుబాబు(39) తన స్వగ్రామం నుంచి మదనపల్లెకు టమాట లోడు తీసుకువచ్చేందుకు బయలుదేరాడు. బద్వేలు సమీపంలోకి వచ్చేసరికి చెన్నంపల్లె వద్ద రోడ్డు పక్కన ఓ లారీ ఆపి ఉండటంతో.. అర్ధరాత్రి పూట సరిగా కనిపించక వెనుకవైపు నుంచి లారీని ఢీకొన్నాడు. ఈ ఘటనలో వాసుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తప్పించి వాసుబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్‌ఐ కొండారెడ్డి కేసు నమోదు చేశారు.
మైదుకూరు : జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరులోని కొత్త కొట్టాలు వీధికి చెందిన పసుపుల నరసింహ, నాగేళ్ల పవన్ కుమార్ అనే వారు దువ్వూరు నుంచి మోటార్ బైక్‌పై మైదుకూరుకు వస్తుండగా శ్రీనగరం వద్ద వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొంది. సంఘటనలో నరసింహకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌లో అతన్ని చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదే విధంగా దువ్వూరుకు చెందిన పున్నం నడిపి సుబ్బరాయుడు, అతని కుమారుడు రామసుబ్బయ్య మైదుకూరు నుంచి ఎర్రగడ్డల బస్తాలు తీసుకుని ఆటోలో వెళుతుండగా.. వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. సంఘటనలో తండ్రీకొడుకులు ఇద్దరికీ గాయాలయ్యాయి.
కుక్క అడ్డు రావడంతో..
కడప అర్బన్ : కడప నగరంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక్ నగర్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో నివసిస్తున్న షేక్ ఖాసిం సాహెబ్, భార్య షేక్ రహజాన్, కుమారుడు అబ్బాస్ అలీ, కుమార్తె ఆయేషాలు కారులో కడపకు ఆదివారం తెల్లవారుజామున బయలుదేరారు. కడపలో బంధువుల ఇంటికి వివాహానికి హాజరు కావాలనుకుని వచ్చారు. వినాయక నగర్ దగ్గరికి వచ్చేసరికి కారుకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రహజాన్, అబ్బాస్ అలీ, ఆయేషాలు గాయపడ్డారు. కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


