అలసత్వం వద్దు.. అప్రమత్తతే ముద్దు | - | Sakshi
Sakshi News home page

అలసత్వం వద్దు.. అప్రమత్తతే ముద్దు

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

కడప ఎడ్యుకేషన్‌ : వేసవి సెలవులు మరో ఐదు రోజుల్లో ముగియనున్నాయి. జూన్‌ 12వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు (అయ్యవార్లు) పాఠశాలల నిర్వహణ పట్ల కాసింత ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవి సెలవులు మొత్తం పాఠశాలలు మూసి ఉంచడంతో చెత్తాచెదారం, దుమ్ము, ధూళి అంతా పేరుకుపోయి ఉంటుంది. దీనికితోడు ఇటీవల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురిసాయి. ఈ కారణంగా తరగతి గదులన్నీ వర్షపు నీరు, దుమ్ముతో నిండి ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు ముందుగానే పాఠశాలలను సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేటప్పుడు విద్యార్థులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం నెలకొంటుంది.

విద్యుత్‌ భద్రత – భవన పటిష్టత : సెలవుల్లో విద్యుత్‌ వైర్లను ఎలుకలు కొరకడం లేదా వర్షాల తేమ కారణంగా షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యే ప్రమాదం ఉంది. స్విచ్‌ బోర్డులు, ఫ్యాన్లు, లైట్ల వైరింగ్‌ను ఎలక్ట్రీషియన్‌తో చెక్‌ చేయించాలి.

భవన మరమ్మతులు : మే నెలలో కురిసిన వర్షాలకు భవనం ఎక్కడైనా లీకేజీలు ఇస్తోందా, గోడలు లేదా పై కప్పుల నుంచి సిమెంట్‌ ఊడిపడుతుందా అనేది గమ నించి, అవసరమైన తక్షణ మరమ్మతులు చేపట్టాలి.

విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యం : జిల్లాలో ఇంకా ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున క్లాస్‌ రూమ్స్‌లో ఫ్యాన్లు సరిగ్గా తిరిగేలా చూడాలి. ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.

ఒత్తిడి లేని వాతావరణం : పాఠశాలలు తెరిచిన మొదటి వారం పిల్లలపై చదువుల ఒత్తిడి పెంచకూడదు. సెలవుల్లో వారు ఎక్కడెక్కడికి వెళ్లారు, ఎలా ఎంజాయ్‌ చేశారనే అంశాలపై ఆటపాటలు, కథల ద్వారా చర్చిస్తూ వారిని క్రమంగా పాఠశాల వాతావరణానికి అలవాటు చేయాలి.

జాగ్రత్తలు

తీసుకోవాలి

ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కలిసి పాఠశాలల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తరగతి గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేయించుకోవాలి. పిల్లలు బడికి వచ్చే సమయానికి పాఠశాలల్లో పూర్తి ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పాలి.

– షేక్‌ షంషుద్దీన్‌,డీఈఓ, కడప

బడి గంట మోగేలోపే పాఠశాలల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి

చెత్తాచెదారం, దుమ్ము, ధూళిపై

సెలవుల్లోనే సమర శంఖం

తొలిరోజు అడుగుపెట్టే విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి

పిల్లల శారీరక, మానసిక భద్రతపై

ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు

ఆట స్థలం నిర్వహణ

పొదల తొలగింపు : నెలన్నరపాటు పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో మైదానంలో పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను తక్షణం తొలగించాలి. లేనిపక్షంలో విషపురుగులు, పాములు వంటివి చేరే ప్రమాదం ఉంటుంది.

సామాగ్రి భద్రత : పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు తుప్పు పట్టకుండా బలంగా ఉన్నాయో లేదో ఉపాధ్యాయులు భౌతికంగా తనిఖీ చేయాలి.

ఉపాధ్యాయులు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గదుల శానిటైజేషన్‌ : సెలవుల్లో మూసి ఉంచిన క్లాస్‌ రూమ్‌లు, డెస్కులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, స్టాఫ్‌ రూమ్‌లను దుమ్ము, ధూళి లేకుండా పూర్తిగా శుభ్రం చేయాలి.

మరుగుదొడ్ల నిర్వహణ : పాఠశాలలోని బాత్‌రూమ్స్‌, మరుగుదొడ్లను ఫినాయిల్‌ లేదా యా సిడ్‌తో కడిగించాలి. పిల్లలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం నీటి వసతి ఉండేలా రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి.

చెదలు మందులు, క్రిమిసంహారక చర్యలు: తరగతి గదుల్లో చేరిన చెదలు, బూజును పూర్తిగా శుభ్రం చేసుకుని, వాటి నివారణకు ముందుగానే మందు పిచికారీ చేసుకోవాలి.

ఫాగింగ్‌ – బ్లీచింగ్‌ : వర్షాకాలం కూడా ప్రారంభమయ్యే సమయం కాబట్టి దోమలు చేరకుండా గదుల్లో, ఆట స్థలంలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం లేదా ఫాగింగ్‌ చేయించడం ఎంతైనా మంచిది.

వాటర్‌ ట్యాంకుల శుభ్రత : పాఠశాలలోని తాగునీటి ట్యాంకులు, ఆర్‌ఓ ప్లాంట్లను పూర్తిగా కెమికల్స్‌తో క్లీన్‌ చేయించి, స్వచ్ఛమైన నీరు లభించేలా చూడాలి. పైపుల్లో చాలా రోజులుగా నిలిచిపోయిన పాత నీటిని పూర్తిగా వదిలేసి, కొత్త నీటితో నింపాలి.

Advertisement
 
Advertisement
Advertisement