రాజంపేట: కడప–తిరుపతి జిల్లాల సరిహద్దుల్లోని చరిత్రాత్మక ‘రెడ్డికుంట’ చెరువు కబ్జా పర్వంలో రాజంపేట రెవెన్యూ అధికారుల ఏకపక్ష వైఖరి, అధికార పార్టీ పక్షపాతం పూర్తిగా బట్టబయలైంది. 13.72 ఎకరాల ప్రభుత్వ నీటి వనరును దర్జాగా మింగేస్తున్న అసలైన కబ్జాదారులను కాపాడేందుకు అధికారులు పక్కా స్కెచ్ వేశారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదుల నేపథ్యంలో కేవలం కొద్దిమంది పాత రికార్డుదారులకే నోటీసులు ఇచ్చి, ప్రస్తుతం చెరువును అక్రమంగా చెరబట్టిన టీడీపీ నేతలను విచారణ పరిధి నుంచి తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలైన ఆక్రమణదారులను కాపాడటానికే చెరువులో నామమాత్రంగా ఒక హెచ్చరిక బోర్డు తగిలించి, రెవెన్యూ శాఖ దర్జాగా చేతులు దులుపుకుందని స్థానిక రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
తమ్ముళ్లకు నోటీసులు లేవు.. అస్మదీయులకు అభయం!
తహసీల్దార్ ఆదేశాల మేరకు జరిగిన రెవెన్యూ విచారణ అంతా ఒక వైపు మాత్రమే సాగిందని జిల్లా రైతాంగం ఆరోపిస్తోంది. పాత రికార్డుల్లో పేర్లు ఉన్న మృతుల వారసులను పిలిపించి నోటీసులు ఇచ్చిన అధికారులు.. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం చెరువు గర్భాన్ని మట్టితో పూడ్చి, ప్లాట్లుగా మార్చి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అసలైన ఆక్రమణదారుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. టీడీపీకి చెందిన కొందరు ముఖ్య అనుచరులు, స్థానిక నేతలు ఈ 13 ఎకరాల కుంటను గద్దల్లా తన్నుకుపోతుంటే.. అధికారం అడ్డుపెట్టుకుని వారి పేర్లను బయటపెట్టకుండా రెవెన్యూ యంత్రాంగం తెరవెనుక నాటకమాడింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టకుండా కేవలం బోర్డుతో సరిపెట్టడం వెనుక అధికారులపై ఉన్న రాజకీయ ఒత్తిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రెవెన్యూ హెచ్చరిక బోర్డులో ఏముందంటే..?
కబ్జాదారుల పేర్లు బయటకు రాకుండా రాజంపేట తహసీల్దార్ పేరుతో రెడ్డికుంట చెరువులో నామమాత్రంగా ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు పాఠకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఆ బోర్డు సారాంశం ఇలా ఉంది. ‘పోలి రెవెన్యూ గ్రామం సర్వే నెంబరు 1488 విస్తీర్ణం 13 ఎకరాల 72 సెంట్ల కుంట.. ఇది ప్రభుత్వ భూమి కనుక ఎవరైనా ఆక్రమిస్తే వారు శిక్షార్హులు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడను. ఇట్లు.. తహసీల్దారు, రాజంపేట.‘ ఈ బోర్డును చూసిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏకంగా 13.72 ఎకరాల ప్రభుత్వ భూమి కళ్లముందే కనుమరుగైపోతుంటే.. ఆక్రమణలను కూల్చేయకుండా, అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయకుండా, కేవలం ‘ఎవరైనా ఆక్రమిస్తే శిక్షార్హులు’ అంటూ బోర్డు పెట్టి వదిలేయడం అధికారుల కపట నాటకానికి పరాకాష్ట అని దెప్పిపొడుస్తున్నారు.
రెడ్డికుంటను దర్జాగా
కబ్జా చేస్తున్న తెలుగుతమ్ముళ్లు
సర్వే నంబరు 1488 పరిధిలోని 13.72 ఎకరాల కుంటపై
సాగుతున్న పచ్చ దోపిడీ
తమ్ముళ్లను దాచేసి రెవెన్యూ ‘హెచ్చరిక’ బోర్డుతో సరి


