బంగారు, వెండి ఆభరణాల చోరీ | - | Sakshi
Sakshi News home page

బంగారు, వెండి ఆభరణాల చోరీ

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

మైదుకూరు : మైదుకూరు పట్టణంలోని వెంకటాపురం రహదారిలో శనివారం భూమిరెడ్డి పెద్ద మాదన్న గారి రమణమ్మ అనే మహిళ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితురాలు రమణమ్మ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీలోని వెంకటాపురం గ్రామానికి చెందిన భూమిరెడ్డి పెద్దమాదన్నగారి రమణమ్మ, భర్త కొండయ్య మృతి చెందడంతో మైదుకూరులో నివాసం ఉంటోంది. పట్టణంలోని వినాయక నగర్‌లో ఉంటున్న ఆమె రెండేళ్ల కిందట వెంకటాపురం రహదారిలో సొంత ఇల్లు కట్టుకుని నివాసాన్ని అక్కడికి మార్చింది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు కాగా అందరికీ వివాహాలయ్యాయి. కుమారుడు సునీల్‌ రైల్వే కోడూరు సమీపంలోని ఫారెస్ట్‌ చెక్‌పోస్టులో పనిచేస్తున్నాడు. ఇంట్లో రమణమ్మ ఒక్కతే ఉంటుంది. శనివారం ఉదయం ఆమె గడ్డమాయపల్లె ప్రాంతంలో ఓ రైతు పొలంలో వేరుశనగ కాయలను ఏరేందుకు పనికి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి ప్రధాన ద్వారం తలుపునకు తాళం చెవి పెట్టేందుకు ప్రయత్నించగా తలుపులు అవే తెరుచుకున్నాయి. గాబరాతో ఆమె తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్లగా బీరువా తెరిచి ఉంది. ఆందోళనతో బీరువాలో చూడగా బంగారు గొలుసు, కమ్మలు, ఉంగరాలు, చెవి మాటీలు, చెవి బుట్టలు, వెండి కాళ్ల పట్టీలు, వెండి మొలతాడు, వెండి గిన్నెలు తదితర వస్తువులు కనిపించలేదు. ఇంట్లో చోరీ జరిగిందని భావించి స్థానిక విజయనగర కాలనీలో ఉంటున్న చిన్న కుమార్తె అల్లుడుకు సమాచారం తెలిపింది. వారు వచ్చి ఇంటి పరిసరాలు వెతికారు. ప్రధాన తలుపు గుండా వచ్చిన అగంతకులు చోరీ అనంతరం ఇంట్లో నుంచి తూర్పు వాకిలి గుండా వెళ్లి బయట గడియ వేసినట్టు గుర్తించారు. బీరువాలో ఉన్న 8.7 తులాల బంగారు వస్తువులు, 43 తులాల వెండి వస్తువులు, రూ.4వేలు నగదు చోరీకి గురైనట్టు ఈ సందర్భంగా బాధితురాలు రమణమ్మ తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు, వేలి ముద్రల నిపుణులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement