జమ్మలమడుగు : జమ్మలమడుగులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రెండు రోజుల కిందట జరిగిన తల్లీబిడ్డల మరణాలపై జిల్లా వైద్యాధికారులు శనివారం విచారణ చేపట్టారు. గురుగడ్డ వీధికి చెందిన పటాన్ రుక్సానాను ప్రసవానికి కుటుంబ సభ్యులు తాతిరెడ్డి రామలింగారెడ్డి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు శుక్రవారం ఆమెకు ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం నవజాత శిశువు మృతి చెందింది. రుక్సానా పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ప్రొద్దుటూరుకు తరలించారు. మార్గంమధ్యలో రుక్సానా కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలు మృతి చెందారని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో జిల్లా వైద్యాధికారి డీఐఓ డాక్టర్ ప్రవీణ్ బృందం శనివారం విచారణ చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు, వైద్యులను విచారించారు. బాధితులతో మాట్లాడి జరిగిన సంఘటనపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు. అనంతరం రామలింగారెడ్డి ఆసుపత్రి వైద్యులను విచారించారు. వైద్యుల నుంచి మృతురాలి కేర్‌షీట్, వాడిన మందుల వివరాలను నమోదు చేసుకున్నారు. విచారణలో జిల్లా వైద్యాధికారి శాంతి, ప్రైవేట్ ఆసుపత్రి ఆసోసియేషన్ వైద్యులు అగస్టీన్‌రాజు, ఎంఎల్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు


