మైదుకూరు : పట్టణ శివారులోని జాతీయ రహదారి బైపాస్‌లో మోటార్ బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న అబ్దుల్ అనే యువకుడు గాయపడ్డాడు. ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. గాయపడిన యువకుడిని చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు.
హౌసింగ్ స్టీల్ మాయంపై విచారణ
ప్రొద్దుటూరు : హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి ప్రొద్దుటూరు మార్కెట్ యార్డులో ఉన్న హౌసింగ్ గోడౌన్లలో విజిలెన్స్ అధికారి కృష్ణయ్య ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. మొత్తం 270 టన్నుల స్టీల్ నిల్వలు ఉండాల్సి ఉండగా కేవలం రెండు టన్నులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం 268 టన్నుల స్టీల్ కొరత ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి ఏఈఈ సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం, రాజంపేట ఈఈ మురళి, ప్రొద్దుటూరు ఈఈ రాజశేఖర్ ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి విజిలెన్స్ బృందం సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు పీడీ తెలిపారు.


