● యువతి మృతి, యువకుడికి తీవ్రగాయాలు
కడప అర్బన్: కడప ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయకనగర్ నుంచి అలంఖాన్‌పల్లెకు వెళ్లేదారిలో ఆర్‌ఎల్‌టి పెట్రోల్ బంకు ఎదురుగా ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కడప నగరం నకాష్‌కు చెందిన సయ్యద్ మొహీసీన్ (18) అక్కడికక్కడే మృతి చెందగా..సయ్యద్ అమీనుల్లా (18) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరు అలంఖాన్‌పల్లెకు వెళ్లేదారిలో ఉన్న కల్యాణమండపంలో బంధువుల వివాహానికి బైక్‌లో వెళ్లారు.వివాహానంతరం తిరిగి బయలుదేరారు. సంఘటన స్థలానికి వచ్చేసరికి కర్నూలు– బెంగళూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు (ఏపి39 యుపి2577) వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొనడంతో యువకుడు ఎగిరి పడ్డాడు. యువతి అదుపుతప్పి బస్సు కిందపడటంతో వెనుకవైపు టైరు ఆమెతలపైకి ఎక్కింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. డిగ్రీ చదువుతున్న ఆ యువతికి నెల రోజుల్లో ఓ యువకుడితో వివాహం జరిపేందుకు నిశ్చయం చేశారు. సయ్యద్ అమీనుల్లా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. సంఘటన స్థలాన్ని కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించినట్లు సీఐ వెల్లడించారు.


