బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

కడప అర్బన్‌: కడప సోషల్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌గా ఓబులేసు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం కడప ఫారెస్ట్‌ రేంజ్‌లో డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయనకు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌గా పదోన్నతి లభించింది. బాధ్యతలను స్వీకరించిన తర్వాత కడప నగరవనంలో జరిగిన కార్యక్రమంలో కడప డిఎఫ్‌ఓ వినీత్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు.

ఆర్‌జేడీగా మధుసూదన్‌ వర్మ

కడప ఎడ్యుకేషన్‌: కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం. మధుసూదన్‌ వర్మకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం కడపలోని కళాశాల ఆర్‌జేడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మధుసూదన్‌ వర్మకు కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్‌ రవికుమార్‌, ఏఓ రమణరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

రామయ్య సన్నిధిలో

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్యను శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృపాసాగర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు.గర్భాలయంలోని మూల విరాట్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో వారిని ఆలయ అర్చకులు సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో సిద్ధవటం ఎస్‌ఐ హారిక, ఒంటిమిట్ట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘పల్స్‌ పోలియో’ను

విజయవంతం చేయాలి

కడప రూరల్‌ : ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమంను విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నాగరాజు తెలిపారు. శుక్రవారం కడపలో వైద్యాధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0–5 సంవత్సరాల పిల్లలలందరికి మొదటి రోజునే చుక్కల మందు వేయాలన్నారు. రెండో రోజు, మూడోరోజు ఇంటింటి సర్వే ద్వారా మార్కింగ్‌ చేస్తూ, మిస్‌ అయిన పిల్లలకు ఇంటి దగ్గర వేయాలని తెలిపారు. పిల్లలకు పోలియో చుక్కలు వేసిన తరువాత, ఎడమ చిటికెన వేలికి మార్క్‌ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఐఓ ప్రవీణ్‌, డాక్టర్‌ రవిబాబు, డాక్టర్‌ ఆరిఫ్‌, జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రముల వైద్యాధికారులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు

ఉల్లంఘిస్తే చర్యలు : ఎస్పీ

కడప అర్బన్‌: ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 252 కేసులు నమోదు చేసి, రూ. 60,778 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ ప్రమాదకరమని, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement