విద్యుత్ వినియోగం వివరాలు
కడప కార్పొరేషన్: మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రతిరోజూ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇంట్లోనూ ఉక్కపోతను భరించలేక ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఎక్కువగా విని యోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వాడకం రికార్డుస్థాయిలో నమోదవుతోంది. గత ఏడాదితో పోల్చితే ఏప్రిల్, మే మాసాల్లో 120.324 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం పెరిగింది. గృహావసరాలతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య ఆధారిత రంగాల్లో విద్యుత్ వాడకం గణనీయంగా పెరుగుతోంది.
గృహ వినియోగమే ఎక్కువ
గృహావసరాలకే ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉక్కపోత కనిపిస్తోంది. నాలుగు రోజులుగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు అధిక విద్యుత్‌వినియోగం జరుగుతున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో ఒక్క రోజులో 16 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అప్రకటిత కోతలు
జిల్లాలో విద్యుత్ కోతలు లేవని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంది. పలు ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ప్రజలు వాపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి.
డిమాండు తగ్గట్టు సరఫరా
వేసవి నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఎక్కడా కోతలు అమలుచేయడం లేదు. పలు ప్రాంతాల్లో ఎండ వేడికి ట్రాన్స్‌ఫార్మర్లు, ఫ్యూజులు కాలిపోతే వాటిని ఎప్పటికప్పుడు మార్పు చేస్తున్నాం. అందుకు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో తప్ప ఎలాంటి కోతలు విధించడం లేదు. – ఎస్. శ్రీనివాసులు, ఎస్‌ఈ, విద్యుత్‌శాఖ.
ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో
510 మిలియన్ యూనిట్ల వాడకం
ఏప్రిల్ 2026 510.857 మిలియన్ యూనిట్లు
మే 2026 444.518 మిలియన్ యూనిట్లు
ఏప్రిల్ 2025 459.455 మిలియన్ యూనిట్లు
మే 2025 375.596 మిలియన్ యూనిట్లు


