కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎన్‌పీసీఐ మ్యాపర్‌లో ఆధార్ సీడింగ్ లేకపోవడం వల్ల అందుకోలేకపోతున్న వారికి.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాల ప్రారంభం ద్వారా పరిష్కారం చూపుతున్నట్లు కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.రాజేష్ తెలిపారు. శుక్రవారం నగరంలోని పోస్టల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు నేరుగా ఖాతాల్లో జమ కావడానికి ఆధార్ సీడింగ్ తప్పనిసరి అన్నారు. అయితే వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి 4,180 మంది లబ్ధిదారుల ఖాతాలు ఎన్‌పీసీఐ మ్యాపర్‌తో అనుసంధానం కాకపోవడంతో వారికి పథకాల ప్రయోజనాలు అందడం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పోస్టల్ శాఖ ద్వారా ఐపీపీబీ ప్రీమియం ఖాతాల ప్రారంభ కార్యక్రమం చేపడుతున్నారన్నారు. ఇప్పటికే బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ ఇనాక్టివ్‌గా మారిన వారు తమ ఖాతాలను ఈ నెల 13వ తేదీలోపు పునరుద్ధరించుకోవాలని సూచించారు. అదే విధంగా ఇప్పటి వరకు బ్యాంకు ఖాతా లేని అర్హులైన లబ్ధిదారులు తమ ఆధార్ నంబర్‌తో ఐపీపీబీ ఖాతాను సులభంగా ప్రారంభించుకోవచ్చని తెలిపారు. ఈ ఖాతాలకు ఆధార్ సీడింగ్ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు నేరుగా జమ అవుతుందని వివరించారు. ప్రత్యేకంగా ఐపీపీబీ ఖాతాదారులకు తపాలా సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి నగదు చెల్లించే సౌకర్యం కూడా అందుబాటులో ఉండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన పౌరులందరూ తమ సమీప తపాలా కార్యాలయాన్ని సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


