పాము కాటుతో వ్యక్తికి అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

పాము కాటుతో వ్యక్తికి అస్వస్థత

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

చౌడేపల్లె : పాము కాటుకు గురై వ్యక్తి అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం జరిగింది. మండల కేంద్రంలోని ప్రైవేటు బస్టాండులో సుబ్రమణ్యం చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన కుమారుడు శబరీష్‌(39) విక్రయదారుకోసం దుకాణంలో సరుకులు తీసే క్రమంలో నాగుపాము కాటేసింది. పాము కాటును గుర్తించిన అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో పుంగనూరుకు తీసుకెళ్లారు. కాగా దుకాణంలోని నాగుపామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదలడానికి తీసుకెళ్లారు.

రోడ్డు ప్రమాదంలో

ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

మదనపల్లె టౌన్‌ : రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం చెందిన విషాదకర ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ముదివేడు ఎస్‌ఐ మధురామ చంద్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. పీటీఎం మండలం పిడింవారిపల్లికి చెందిన రెడ్డప్ప కుమారుడు కొండా ఉదయ్‌ కుమార్‌(20) తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా, కురబలకోట మండలం కాండ్లమడుగు క్రాస్‌ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా లేక బైక్‌ అదుపు తప్పి పడి చనిపోయాడా అనేది తెలియాల్సి ఉందని ఎస్‌ఐ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు. యువకుడి మృతితో పిడింవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంజినీరింగ్‌ చదువుతున్న బిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అంది వచ్చిన బిడ్డను దేవుడు దూరం చేశాడని పెడుతున్న ఆర్తనాదాలు చూపరుల హృదయాలను తీవ్రంగా కలిచి వేశాయి.

వ్యవసాయ మోటార్ల కేబుల్‌ వైర్ల చోరీ

వాల్మీకిపురం : మండలంలోని నగరిమడుగు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో దాదాపు 10 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్ల వద్ద ఉన్న కేబుల్‌ వైర్లను చోరీ చేసిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగిరిమడుకు చెందిన రెడ్డెప్ప, శ్రీరాములు, జ్యోతి, నరసింహారెడ్డి, రెడ్డెప్ప, వెంకటరెడ్డి, రామాంజులు, నాగమ్మ, రామయ్య తదితర రైతుల వ్యవసాయ భూముల వద్ద 200 మీటర్లకు పైగా ఉన్న కేబుల్‌ వైర్లను గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు శుక్రవారం గుర్తించారు. అసలే వ్యవసాయంలో నష్టాలు చవిచూస్తుంటే మరో పక్క వైర్లను చోరీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చొరవ చూపి కేబుల్‌ వైర్ల దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement